ప్రభాకర్‌రావు అరెస్ట్‌కు వారెంట్
ఫోన్ ట్యాపింగ్ కేసు
పోలీసుల విజ్ఞప్తితో వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు
మీడియా సంస్థ యజమాని శ్రవణ్‌కుమార్‌కూ వారెంట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్ట్ చేసేందుకు నాంపల్లి కోర్టు వారెంట్ జారీ చేసింది. గత శుక్రవారం పోలీసులు సీఆర్‌పీసీ 73 సెక్షన్ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, తిరుపతన్న, భుజంగరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో వారు చెప్పి న వివరాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రభాకర్‌రావు.. ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించారని దర్యాప్తు బృందం గుర్తించింది. కాగా, కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు.
దీంతో పోలీసులు ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కానీ, రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చేందుకు, ఇంటర్‌పోల్ అధికారులను సంప్రదించిందుకు కోర్టు అనుమతించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఆర్‌పీసీ 73 ద్వారా పోలీసులు అరెస్ట్ వారెంట్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాకర్‌రావుతో పాటు ఈ కేసులో ఏ6 గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్‌కుమార్‌కూ నాంపల్లి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
వారెంట్ జారీ చేయొద్దు..
ఫోన్‌ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ కోసం పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత నిందితుడు ప్రభాకర్‌రావు సైతం పిటిషన్ దాఖలు చేశారు. తనపై అరెస్ట్ వారెంట్ జారీ చేయొద్దంటూ అభ్యర్థించారు. దర్యాప్తు సంస్థ దరఖాస్తును కొట్టివేయాలని కోరారు. నాలుకపై ఏర్పడిన ట్యూమర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని, చికిత్స పూర్తయిన తర్వాత హైదరాబాద్‌కి తిరిగివచ్చి దర్యాప్తు అధికారులకు సహకరిస్తానని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ కేసులో ఏ6గా ఉన్న మరో నిందితుడు శ్రవణ్ కూడా తనపై అరెస్ట్ ఉత్తర్వులు జారీ చేయొద్దంటూ పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్‌పీసీ 73 సెక్షన్ కింద తనపై పోలీసులు నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని తెలిపారు. భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకారం అందిస్తానని పిటిషన్‌లో పేర్కొన్నారు.






