ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయి?
బీజేపీకి కాంగ్రెస్ అంటే వణుకు పుట్టింది
అందుకే టెంపోల్లో డబ్బులు అంటూ మోదీ అబద్ధాలు చెబుతున్నారు
మతంతో రాజకీయాలు చేస్తున్నారు
తెలంగాణలో ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
హైదరాబాద్, మే ౧౦ (విజయక్రాంతి): కాంగ్రెస్‌కు అంబానీ, అదానీ టెంపోల్లో డబ్బులు పంపుతుంటే ప్రధాని మోదీ చేతుల్లో ఉన్న ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు ఏం చేస్తున్నాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. బీజేపీకి కాంగ్రెస్ భయం పట్టుకున్నదని, అందుకే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏమీ చేయలేక రాజకీయాల్లోకి మతాన్ని లాగుతున్నారని విమర్శించారు. ‘అంబానీ, అదానీ ఇచ్చిన డబ్బులు టెంపోల్లో పోతుంటే మీరు కళ్లు మూసుకున్నారా? మీ సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలు ఏం చేస్తున్నాయి’ అని మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శుక్రవారం మాట్లాడుతూ.. కాంగ్రెస్ భయంతోనే మటన్, చికెన్, బీఫ్, మొఘల్, మంగళసూత్రం లాంటి చిన్న చిన్న సమస్యలను తెరమీదకు తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ, కర్ణాటకలో తామిచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వస్తే కులగణన చేసి ఆస్తులు లాక్కుంటుందనే ప్రచారాన్ని తెరమీదికి తెచ్చారని మండిపడ్డారు.
ప్రధాని స్థాయిలో ఉండి చిల్లర మాటలు మాట్లాడటం సరికాదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టారని ఖర్గే ధ్వజమెత్తారు. బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతూ.. పూలు పొద్దున పూస్తాయి.. సాయంత్రానికి వాడిపోతాయి. హస్తం ఎప్పుడూ మీతోనే ఉంటుంది అని చమత్కరించారు. కాగా, ప్రస్తుత ఎన్నికల నిర్వహణలో పలు దశల్లో పోలింగ్ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని, కానీ ఈసీ ఆదేశాలను అందరూ పాటించాల్సిందేనని సూచించారు.
జనగణనలో ఆలస్యమెందుకు?
పదేళ్లకోసారి దేశ జనాభాను లెక్కించాలని, ఇది 2021లోనే కావాల్సిందని.. అయితే మోదీ ప్రభుత్వం ఇప్పటికీ చేయలేదని ఖర్గే ఆరోపించారు. జానాభా లెక్కలు తీస్తే పేద ప్రజలకు మెరుగైన కార్యక్రమాలు అమలు చేయవచ్చని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ఈ దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కులగణన చేస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. సివిల్ సర్వీస్ ఆఫీసుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీలుగా 27 శాతమే ఎస్సీ, ఎస్సీ, బీసీ వర్గాల వారు ఉన్నారని, ఆయా వర్గాలకు న్యాయం చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఖర్గే వివరించారు.
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అనాడే చెప్పారని ఖర్గే గుర్తు చేశారు. అలాంటి హైదరాబాద్‌ను కాదని గుజరాత్‌కు పెట్టుబడు లను మోదీ తరలించుకెళ్లారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిరాశలో ఉన్న వారే ప్రభుత్వం కూలిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యట్టారు.
ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశాం..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేస్తున్నామని ఖర్గే తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయలేదన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంపు వంటి అంశాలు అమలవుతున్నాయని తెలిపారు. మిగతావి ఎన్నికల తర్వాత అమలు చేస్తామన్నారు.
కాంగ్రెస్ నేతలు సామ్ పిట్రోడా, మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా ఖర్గే సమాధానం దాటవేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






