11 June, 2026 | 1:04 AM

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం లేని వారికి నోటీసులు

11-06-2026 12:00 AM
  1. నిర్మాణ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలి
  2. హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతం

మేడ్చల్, జూన్ 10 (విజయక్రాంతి): మంచి లే అవుట్లు, అన్నిరకాల మౌలిక వసతులతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో  లబ్ధిదారులు అందరూ నివసించేలా చూడాలని, ఇళ్లలో నివాసం లేని వారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ ఎం.డి  వి.పి.గౌతం అధికారులను ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న 2 బిహెచ్ కె కాలనీల్లోని పనులన్నిటినీ త్వరతగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్  మను చౌదరితో కలిసి  పలు 2 బిహెచ్ కె కాలనీల్లో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారు.  బౌరంపేట, గండిమైసమ్మ, దుండిగల్ లోని 2 బిహెచ్ కె కాలనీల్లో పర్యటిస్తూ ఆయా కాలనీల్లో నివసిస్తున్న వారితో మాట్లాడారు. దుండిగల్ ఫేజ్ -1, డబుల్ బెడ్ రూం కాలనీలో పర్యటించి అక్కడి మౌలిక వసతుల గురించి ఆరా తీశారు.

ఇండ్లను కేటాయించిన లబ్ధిదారుల్లో ఇంకా చాలా మంది ఇక్కడ నివాసం ఉండని విషయాన్ని తెలుసుకుని, వారందరూ ఇక్కడికి తరలివచ్చేలా చొరవ చూపాలని, ఇక్కడ నివసిం చకపోతే ఇంటి రద్దు చేస్తామని మరోసారి నోటీసులు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగు పడాలని, వారికి సమాజంలో గౌరవం పెరిగేలా సొంత ఇంటి వసతిని కల్పించే లక్ష్యంతో చేపడుతున్న గృహ నిర్మాణ పథకాలని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన స్థానికులకు వివరించారు.

తమకు ఇండ్లు కావాలని వేల మంది ప్రజలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసినా ఉండటానికి ముందుకు రానివారికి కేటాయింపులను రద్దు చేసి అర్హులైన ఇతరులకు ప్రయోజనం కలిగిస్తామని స్పష్టం చేశారు. దుండిగల్ ఫేజ్-2 కాలనీల్లోని పనుల పురోగతిని పరిశీలించి, త్వరితగతిన నిర్మాణాలను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. మౌలిక వసతుల పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.   

2బిహెచ్ కె కాలనీల్లోని ఇండ్లను, సమీపంలోని 5 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికే కేటాయిం చాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నదని ఈ మేరకు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నదని ఎండి గౌతం తెలిపారు. స్థానికంగా గండిమైసమ్మ ప్రాంతంలో ఇందుకు సంబంధించి జరుగుతున్న సర్వే ప్రక్రియను అధికారులు పరిశీలించారు.

ప్రజా పాలన సందర్భంగా తమ కు ఇల్లు కావాలంటూ దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంటి స్థలం- సొంత ఇల్లు లేని  (ఎల్-2) జాబితాలో ఉన్న వారికి 2 బిహెచ్ కె ఇం డ్లను కేటాయించేందుకు వీలుగా, ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన వారిని గుర్తించేందుకు తహశీల్దార్లు ఇతర అధికారుల ద్వారా కొద్దిరోజులుగా సర్వే నిర్వహిస్తున్నారు. గండిమైసమ్మ ప్రాం తంలో అధికారులు నిర్వహిస్తున్న సర్వేను అధికార బృందం పర్యవేక్షించింది.

సర్వే వివరాలను సమగ్రంగా, యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారా లేదా, అర్హతల నిర్ధారణ ప్రక్రియ తదితర అంశాలను గమనించి, సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.  సర్వే అనంత రం, యుద్ధప్రాతిపదికన ముందుగా 2 బిహె చ్ కె ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికను చేయాలని జిల్లా కలెక్టర్  మను చౌదరికి, ప్రత్యేక కార్యదర్శి సూచించారు. హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ ఎం.చైతన్యకుమార్, సూ పరింటెండింగ్ ఇంజనీర్ విజయకుమార్,  హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ జి.వి.రమణారెడ్డి, జిల్లా హౌసింగ్ పిడి  రమణమూర్తి, ఇంజనీర్లు  పి.వి.రవీందర్ తోపాటు, స్థానిక రెవెన్యూ, వాటర్ వర్క్, విద్యుత్ శాఖ లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.