ఇద్దరు ఐఏఎస్‌లకు నోటీసులు
- జారీ చేసిన హైకోర్టు
- కోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఆగ్రహం
- 26న కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
హైదరాబాద్, డిసెంబర్ 11: హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి, ఆర్టీఐ చట్టం ప్రకారం సమాచా రం ఇవ్వలేదని వడ్డం శ్యామ్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టీఐ అప్పీలేటు అధికారులుగా ఉన్న మాజీ జీహెచ్‌ఎంసీ కమిషనర్ కె.ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్ ఆర్‌వీ కర్ణన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలున్నా సమాచారం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఐఏఎస్‌లపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కోరింది. చేసింది. ఆర్టీఐ చట్టం ప్రకారం పిటిషనర్ అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో గతంలో సికింద్రాబాద్‌లోని రాంగో పాల్‌పేటకు చెందిన వడ్డం శ్యామ్ హైకోర్టును ఆశ్రయించారు.శేరిలింగంపల్లిలో సిటీ ప్లానర్లు జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లకు ఆర్టీఐ కింద సంబంధించి రికార్డుల పరిశీలనకు అనుమతించకపోవడాన్ని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వెంటనే అడిగిన సమాచారం ఇవ్వాలని నవంబర్ 24న ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలే దని శ్యామ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ జరిపిన ధర్మాసనం ఐఏఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆర్‌టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని న్యాయమూర్తి భీమపాక నగేశ్ ప్రభుత్వం తరఫు లాయర్‌ను ప్రశ్నించారు.
సదరు ఐఏఎస్‌లపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26న కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. చేసిన తప్పుకు రూ.10 వేల వరకు జరిమానా కూడా విధించాల్సి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.




