పాల క్యాన్లపై 12 శాతం పన్ను
రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్లపై మినహాయింపు
కార్టన్ బాక్సులపై 12 శాతం పన్ను విధింపు
జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు
న్యూఢిల్లీ, జూన్ 22: పాల క్యాన్లపై (స్టీల్, అల్యూమినియంతో తయారైనవి) 12 శాతం వస్తు సేవల పన్నును జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుచేసింది. ఆ క్యాన్లను పాలకోసమే కాకుండా ఎందుకోసం వినియోగించినా అదే పన్ను వర్తిస్తుంది. క్యాన్ రూపాన్నిబట్టి అది పాల క్యానా, కాదా అనే విషయాన్ని నిర్ధారిస్తారు. అలాగే పండ్ల రవాణాకు, నిల్వ చేయడానికి ఉపయోగించే కార్టన్ బాక్సులపై (పేపర్‌బోర్డ్‌తో తయారీ) ఒకేరీతిలో 12 శాతం జీఎస్టీని సిఫార్సుచేసింది.
శనివారం జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశపు నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడిస్తూ రైల్వే శాఖ అందించే ప్లాట్‌ఫాం టికెట్లు, బ్యాటరీతో నడిచే కార్ సర్వీసులు తదితరాలపై జీఎస్టీని మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఎరువులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న 5 శాతం పన్నును తొలగించాంటూ పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సును జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణకు ఏర్పాటైన మంత్రుల కమిటీకి పంపించాలని కౌన్సిల్ నిర్ణయించినట్టు సీతారామన్ చెప్పారు. గత అక్టోబర్ 7 తర్వాత కౌన్సిల్ సమావేశం కావడం ఇదే తొలిసారి. కేంద్ర బడ్జెట్ తర్వాత జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశమవుతుంది.
ఇతర నిర్ణయాలు..
హాస్టల్ సర్వీసులపై మినహాయింపు
విద్యా సంస్థల ఆవరణలకు వెలుపల ఉండే హాస్టల్ అకామడేషన్ సర్వీసులపై నెలకు రూ. 20,000 వరకూ జీఎస్టీ కౌన్సిల్ పన్నును మినహాయించింది.
స్ప్రింక్లర్లపై 12 శాతం జీఎస్టీ
వాటర్ స్ప్రిక్లర్లతో సహా అన్ని రకాల స్ప్రింక్లర్లపై 12 శాతం జీఎస్టీ వరిస్తుందని కౌన్సిల్ స్పష్టం చేసింది.
ఎరువులపై జీఎస్టీ రేట్లు
రైతులు, ఎరువుల తయారీ కంపెనీల ప్రయోజనాల రీత్యా ఎరువులపై జీఎస్టీని ఎత్తివేయాలని, ఎరువుల తయారీకి వాడే ముడిపదార్థాలపై జీఎస్టీని తగ్గించాలంటూ పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సును కౌన్సిల్ చర్చించి, దానిని జీఎస్టీ రేట్ల కమిటీకి రిఫర్ చేసింది. ప్రస్తుతం ఎరువులపై 5 శాతం జీఎస్టీని వసూలు చేస్తుండగా, ఎరువుల తయారీ ముడి పదార్థాలైన సల్ఫ్యూరిక్ యాసిడ్, అమ్మోనియాలపై 18 శాతం జీఎస్టీని విధిస్తున్నారు.
ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి
ఇక నుంచి కొత్త జీఎస్టీ రిజిస్ట్రేషన్లకు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను కౌన్సిల్ తప్పనిసరి చేసింది. డిమాండ్ నోటీసులపై వడ్డీ, పెనాల్టీలను రద్దు చేయాలని కూడా కౌన్సిల్ నిర్ణయించింది.
లిటిగేషన్లకు పరిమితులు
జీఎస్టీ వివాదాలకు సంబంధించి ఆయా కోర్టుల్లో అప్పీలు చేయడానికి ద్రవ్య పరిమితులను కౌన్సిల్ సిఫార్సుచేసింది. రూ.20 లక్షల వివాదం వరకూ జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో, రూ. 1 కోటి వరకూ హైకోర్టు, రూ.2 కోట్లకు సుప్రీంకోర్టులో డిపార్ట్‌మెంట్ అప్పీలు చేయాలని కౌన్సిల్ సిఫార్సుచేసింది.






