మహిళల రక్షణే షీటీమ్ ధ్యేయం
- సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల, (విజయక్రాంతి) : మహిళల రక్షణ, భద్రతే షీటీమ్ ప్రధాన ధ్యేయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల షీటీమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ), భరోసా కేంద్రాల సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు. మహిళలకు షీటీమ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ప్రాంతాల్లో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
భరోసా కేంద్రాల్లో లీగల్ అడ్వైజర్, కౌన్సిలర్, వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు, బాలికలకు సంబంధించిన కేసులు పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన తర్వాత బాధితులకు అవసరమైన సహాయం అందిస్తూ, వారి మానసిక స్థితి, విద్యా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని సూచించారు. మహిళలు, యువతులు అత్యవసర పరిస్థితుల్లో షీటీమ్ నంబర్ల ( రామగుండం పోలీస్ కమిషనరేట్ షీటీమ్ 63039 23700, పెద్దపల్లి జోన్ 87126 59384, మంచిర్యాల జోన్ 87126 59385) కు లేదా డయల్ 100కు కాల్ చేసి నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఇన్‌స్పెక్టర్ భీమేష్, పెద్దపల్లి ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ శైలజ, మంచిర్యాల జోనల్ షీటీమ్ ఇన్‌చార్జ్, మహిళా ఎస్‌ఐ ఉషారాణి, భరోసా కేంద్రం,షీటీమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






