8 May, 2026 | 5:45 PM

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

08-05-2026 04:37 PM

వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

హనుమకొండ, మే 08(విజయ క్రాంతి): ఉద్యోగంలో స్థాయి పెరిగిన కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల ఏఎస్సై స్థాయి నుంచి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లుగా పదోన్నతి పొందిన 25 మంది అధికారులు శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన ఎస్.ఐ భుజాలపై  నక్షత్ర చిన్నహాలను అలంకరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పదోన్నతులు కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా ప్రజల పట్ల మరింత బాధ్యతతో పనిచేసే అవకాశం అని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను సానుభూతితో వినడం, చట్టపరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవడం, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచే విధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్‌ విధానాన్ని అవలంబిస్తూ, బాధితులకు తక్షణ సహాయం అందించాలన్నారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి అధికారి కీలక పాత్ర పోషించాలని, విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని ఆయన సూచించారు. నూతనంగా పదోన్నతి పొందిన అధికారులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీపీ తెలిపారు.