19 March, 2026 | 6:26 AM

అక్రమాలకు తలొగ్గుతున్న అధికారులు!

19-03-2026 02:02 AM
  1. వారికి భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు 
  2. డ్రగ్స్ కేసులో పట్టుబడిన రోహిత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చాం
  3. చిట్‌చాట్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): మూసీ ప్రాజెక్ట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని, ఆరు నూరైనా పూర్తి చేస్తాం అనే వ్యాఖ్యలు చేయడం వారి అధికార పరిధికి మించినదని, ప్రభుత్వ అక్రమాలకు తలొగ్గే అధికారులకు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బుధవారం అసెంబ్లీ ఎల్‌ఓపీ కార్యాలయంలో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు.

57 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చామని మంత్రి భట్టి విక్రమార్క చెప్తున్నారని, అవి ఇచ్చినట్టు నిరూపిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. అదే సమయంలో సీతక్క తనను రాజీనామా చేయమంటున్నారని, అసెంబ్లీలో అబద్ధాలు చెప్పినవారే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్ బాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, డీపీఆర్ ఇచ్చామని చెప్తున్నప్పటికీ వాస్తవానికి డీపీఆర్ సమర్పించకపోవడంతోనే ఏడీబీ రుణం మంజూరు కాలేదని తెలిపారు.

3,297 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి 10 వేల ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పుడు 1400 ఇళ్లు మాత్రమే అంటున్నారని, ఇది పూర్తిగా ప్రజలను మోసం చేసే ప్రక్రియ అని అన్నారు. మధు పార్క్ కోసం ప్రత్యేకంగా ఇళ్లు ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? మిగతా వారికి ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. భూ సేకరణను ఫార్మా సిటీ పేరిట చేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలకు, ఇతరులకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుల మధ్య ప్రజలను ఎలా నివసింపజేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో కూడా అసత్యాలు ఉన్నాయని, 57 వేల కోట్ల రుణాల అంశంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. వెలుగుమట్ల వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ పెద్దలు ఎందుకు వెళ్లి చూడలేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు.

హనుమాన్ నగర్ వంటి ప్రాంతాల్లో బఫర్ జోన్ పేరిట దూర ప్రాంతాల ప్రజలకు నోటీసులు ఇవ్వడం అన్యాయమని పేర్కొన్నారు. పొంగులేటి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నేతల ఇళ్లు కూడా అదే జోన్లో ఉన్నాయని, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉందని ఆరోపించారు. మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని ఆరోపించారు. గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా? అని ప్రశ్నించారు. అమీన్‌పూర్‌లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందన్నారు.

అసెంబ్లీలో తమనే తట్టుకోవడం లేదు, కేసీఆర్‌ను ఎలా తట్టుకుంటారని ఎద్దేవా చేశారు. పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వం వైఖరిని చూపుతుందని విమర్శించారు. సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తెలిపారు. డ్రగ్ కేసులో దొరికిన పైలట్ రోహిత్‌రెడ్డికి ఇప్పటికే షోకాజ్ నోటీసులిచ్చామని,

ఆయన నుంచి వివరణ వచ్చాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందిస్తూ... జీవన్‌రెడ్డిని మేము ఇప్పటి వరకు సంప్రదించలేదన్నారు. మెయిన్ హర్ట్ అనే కంపెనీని పాకిస్థాన్‌లోనే నిషేధించారని, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసిన సంస్థను ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.