19 March, 2026 | 3:16 AM

2029లోనే జమిలి ఎన్నికలు

19-03-2026 01:40 AM
  1. రాష్ట్రంలో 2028లో అసెంబ్లీ ఎన్నికలు ఉండవు 
  2. మోయినాబాద్ డ్రగ్స్ కేసులో నా జోక్యం లేదు 
  3. నిబంధనల మేరకే కేసులు నమోదు 
  4. డ్రగ్స్ కేసుపై సిట్ ఏర్పాటు చేశాం 
  5. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
  6. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిని రాహుల్, ప్రియాంకగాంధీలకు పరిచయం చేసిన సీఎం 

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు 2028లో ఉండవని, 2029లోనే జమిలి ఎన్నికలు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ లోపు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు వస్తే సంతోషమని అన్నారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రి యాంక గాంధీని బుధవారం  సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కలిశారు.

తెలంగా ణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని రాహుల్, ప్రియాంక గాంధీలకు పరిచయంచేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మోయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డ్రగ్స్ కేసు విషయంలో తన ప్రమేయం లేదని, ఈ కేసులో తాను జోక్యం చేసుకోలేదని, అంతా నిబంధనల మేరకే జరిగిందని స్పష్టంచేశారు. ఈ డ్రగ్స్ కేసుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటుచేసినట్టు చెప్పారు.

ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌కు స్టేషన్ బెయిల్‌రూల్స్ ప్రకారమే ఇచ్చారని తెలిపారు. ‘తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారైన సరే ఉక్కుపాదంతో అణచివేస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలోని లోపాలను సరిదిద్దుతూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు.

అంతకు ముందు సీఎం రేవంత్‌రెడ్డిని వైఎస్సార్సీపీ నాయకురాలు రోజా కలిశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలవడానికి రోజా పార్లమెంట్‌కు రాగా ఈ క్రమంలోనే ఇరువురూ ఎదురుపడ్డారు. రోజాకు మర్యాదపూర్వకంగా షేక్య్‌ండ్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, ఆమె యోగక్షే మాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట ఎంపీలు సురేశ్‌షెట్కార్, మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అనిల్ కుమార్‌యాదవ్ ఉన్నారు.