అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ కుమార్ దీపక్
కోటపల్లి, జూలై 29 : వర్షాలు కురుస్తున్న సమయంలో గోదావరి, ప్రాణహిత తీరం అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. బుధ వారం కోటపల్లి మండలం అర్జున గుట్ట సమీపంలో గల ప్రాణహిత నది తీరాన్ని సందర్శించి నీటి ప్రవాహం, సమీప పరిస్థితులను మండల తహసిల్దార్ రాఘవేంద్ర, సి.ఐ. కృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేశ్వర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, నదిలో నీటి ప్రవాహ తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రజా సంక్షేమ చర్యలను చేపట్టాలని తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మెనూ అమలు, రిజిస్టర్లను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఈ సందర్భంగా ఎన్.డి.ఆర్.ఎఫ్. సభ్యులతో ప్రస్తుతం నెలకొన్న వర్ష పరిస్థితులపై సమీక్షించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవానికి సమీపంలో ఉన్న గర్భిణుల వివరాలతో జాబితా రూపొందించాలని, ప్రసవాలు ఆసుపత్రిలోని జరిగే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.






