30 July, 2026 | 3:33 PM

నవజాత శిశు మరణాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి

03-09-2025 01:03 AM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి,(విజయక్రాంతి): నవజాత శిశు మరణాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో  వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో నవజాత శిశు మరణాల వివరాలు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసలు ను అడిగి తెలుసుకుని నివేదిక పరిశీలించారు. జిల్లాలో ఇప్పటివరకు 29 మంది నవజాత శిశువులు మరణించడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

గర్భిణులకు, బాలింతలకు ముందస్తుగా టిఫా స్కానింగ్, హిమోగ్లోబిన్, బరువు తక్కువగా ఉండడం వంటి పరీక్షలను సరైన సమయంలో క్రమం తప్పకుండా పరీక్షించాలని వైద్య అధికారులకు  సూచించారు. గ్రామాలలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు  మిల్క్ ఫీడింగ్ ఇచ్చే సమయంలో  నవజాత శిశువుకు ఎలాంటి  జాగ్రత్త లు తీసుకోవాలో బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. పీడియాట్రిషన్, గైనిక్ డాక్టర్లు నవజాత శిశువుల పట్ల ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలతో కల్పనకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు.  మరణించిన నవజాత శిశువుల తల్లిదండ్రులు, వారి సహాయకులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.