30 July, 2026 | 2:49 PM

వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యటన

03-09-2025 01:03 AM

మానేరులో గల్లంతైన కుటుంబానికి 5 లక్షల సాయం 

పశువుల యజమానులకు పరిహారం నర్మాల పాఠశాల ఆకస్మిక తనిఖీ

గంభీరావుపేట, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గంభీరావుపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం పర్యటించారు.నర్మాల ఎగువ మానే రు వద్ద గల్లంతైన పంపుకాడి నాగయ్య కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.5 లక్షల చెక్కు ఆయన భార్య లక్ష్మీకి కలెక్టర్ అందజేశారు.

అలాగే వరదలో చనిపోయిన పశువుల యజమానులు గడ్డమీది మణెమ్మ రూ.1 లక్ష, ప్రవీణ్ గౌడ్ రూ.50 వేల లకు పరిహారం చెక్కులు అందజేశారు.తర్వాత కలెక్టర్ నర్మాలలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టులపై పట్టు వచ్చేలా సులభమైన పద్ధతిలో బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదులు, వంటగది పరిశీలించి, భవనాల పైకప్పులు, కిటికీలు, పరిశుభ్రత, వాటర్ లీకేజీలపై అధికారులను ఆదేశించారు.

అలాగే వరదలతో దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ లైన్లు, మిషన్ భగీరథ పైపులైన్లను పరిశీలించారు. తక్షణమే మరమ్మత్తు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రైతులు, పశువుల యజమానులు నీటి ప్రవాహ ప్రాంతాలకు పశువులను తీసుకెళ్ళవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్, కాంగ్రెస్ నాయకులు హమీద్, తిరుపతి, స్థానిక ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.