12 August, 2026 | 10:38 PM

జవహర్‌నగర్‌లో అధికారుల పర్యటన.. సమస్యలపై ఆరా

12-08-2026 09:30 PM

జవహర్‌నగర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జవహర్‌నగర్‌లో అధికారులు విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. డిప్యూటీ కమిషనర్ రాధిక గుప్తా, సంచిత్ గంగాయర్ తదితర అధికారులు జవహర్‌నగర్‌లోని పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా సంతోష్‌నగర్, పాపయ్యనగర్ కాలనీల్లో పర్యటించిన అధికారులు అక్కడి మౌలిక వసతులు, పారిశుద్ధ్య పరిస్థితులు, డ్రైనేజీ వ్యవస్థ, ఓపెన్ నాలాల సమస్యలను పరిశీలించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కాలనీల్లోని ఓపెన్ నాలాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించినట్లు తెలిసింది. వర్షాకాలంలో నాలాలు పొంగిపొర్లకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను గుర్తించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులు పేర్కొన్నారు. స్థానికులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల పర్యటనతో కాలనీల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆశాభావాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.