12 August, 2026 | 10:48 PM

బెల్లంపల్లిలో సీపీఐ పోరు యాత్ర

12-08-2026 09:28 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి పిలుపుమేరకు ఆగస్టు 6 నుండి 14 వరకు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర బుధవారం బెల్లంపల్లి కి చేరింది. పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళి అధ్యక్షతన భగత్ సింగ్ విగ్రహానికి అమరజీవి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్  విగ్రహానికి పూలమాలలు వేసి పోరు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సీపీఐ కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకట స్వామి, బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి దేశమంతట ప్రజలను చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం చేపట్టమన్నారు.

సార్వత్రికవిద్య ప్రజల ఆరోగ్యం గురించి వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలని, యువకులకు ఉపాధి కల్పించాలని ధరల పెరుగుదల అరికట్టాలని పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని దళిత ఆదివాసీలపై ఆకృత్యాలను దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని, కార్మిక హక్కులను పరిరక్షించాలని బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని కోరారు.

అలాగే బెల్లంపల్లి పట్టణంలో రోడ్డు విస్తరణలో ఉపాధి కోల్పోయిన వారికి వెంటనే వారికి ఉపాధి కల్పించాలన్నారు. బెల్లంపల్లి పట్టణము చుట్టూ ఉన్న ఖాళీ భూములను రియల్ ఎస్టేట్ లు కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి వెంటనే ఆపాలని క్రమంగా మంచినీరు సరఫరా చేయాలని కోరారు.