3 March, 2026 | 4:51 PM

అమ్మో.. పీఆర్సీనా!

13-11-2025 01:09 AM

ఉలిక్కి పడుతున్న సర్కారు

కమిటీ నివేదిక ఎప్పుడో సిద్ధం

ఆర్థిక భారం మోయలేకనే అమలు చేయడం లేదంటున్న ఉద్యోగులు

  1.    2023 జూలై 1 నుంచే అమలు కావాల్సి ఉన్న నూతన పీఆర్సీ 
  2.    51 శాతం ఫిట్‌మెంట్ అడుగుతున్న ఉద్యోగ సంఘాలు
  3. కనీసం 1 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా రూ. 250-300 కోట్లు సర్కారుపై భారం

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఆర్థిక పరమైన అంశాల గురించి లేవనెత్తితే చాలు ప్రభుత్వం ఉలిక్కి పడుతోంది. ఏవీ అడగొద్దు.. బడ్జెట్ లేదు అని ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని తెలిసింది. తెలంగాణ తొలి పీఆర్సీ గడు వు 2023 జూన్ 30తో ముగిసిపోయింది. కొత్త పీఆర్సీని 2023 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం దాని ఊసేత్తడంలేదు.

గడువు ముగిసినా ఉలుకు పలుకు లేదు. పీఆర్సీ గురించి మాట ఎత్తవద్దనే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. అసలే రాష్ట్ర రాబడి అంతంత మాత్రంగా ఉంది. వచ్చే ఆదాయం సంక్షేమ పథకాలు, ఉద్యోగులు జీతాలకే సరిపోతోంది.

దీనికి తోడు కేంద్రం జీఎస్టీ స్లాబులను కూడా సవరించడంతో రాష్ట్రానికి ఆదాయం ఆశించిన స్థాయిలో రావడంలేదు. ఈక్రమంలో పీఆర్సీని అమలుచేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రభుత్వం అందుకే పీఆర్సీ జోలికి ప్రస్తుతం పోవడంలేదని తెలుస్తోంది. 

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతన సవరణను ఎప్పటికప్పుడు కమిషన్‌ను నియ మించడం, నివేదికను తెప్పించుకోవడం, దాన్ని అమలు చేయడం జరుగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అది టైం ప్రకారం అమలు కావడంలేదు. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ అమలుకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ చైర్మన్‌గా, రిటైర్డ్ ఐఏఎస్ బీ.రామయ్య సభ్యుడిగా రెండో పీఆర్సీ కమిటీని అప్పట్లో నియమించింది.

ఈ కమిటీ ఆరు నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. 2024 ఏప్రిల్ 2వ తేదీతో ఆ కమిటీ గడువు ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్ని కల కారణంగా కమిటీ గడువును ఆరునెలలు పొడిగించారు. ఈ అక్టోబర్ 2వ తేదీకి పీఆర్సీ కమిటీని నియమించి రెండేండ్లు పూర్తయ్యింది. నవంబర్ నెల కూడా గడిచిపోతోంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పిం చేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి ఈ పీఆర్సీ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ప్రతిపాదనలు సైతం స్వీకరించింది.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు 51 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని కమిటీకు ప్రతిపాదించారు. ఈమేరకు కమిటీ పలు సిఫా ర్సులతో పీఆర్సీ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వం పిలుస్తే నివేదిక ఇవ్వాలని కమిటీ చూస్తోంది. పిలిస్తే ఇస్తామని కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ చెప్పినట్లు ఓ కీలక ఉద్యోగ సంఘం నేత పేర్కొన్నారు.

ప్రభుత్వంపై రూ. 7,500 కోట్లు భారం.. (బాక్స్)

ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుంచి పీఆర్సీ నివేదికను తీసుకుంటే వెంటనే ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. పీఆర్సీని అమలుచేయాల్సి ఉంటుంది. పీఆర్సీ కమిటీకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరాయి. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లున్నారు. వీరందరికీ కనీసం 1 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకు రూ. 250 నుంచి రూ. 300 కోట్లు కావాల్సి ఉంటుంది. అదే 51 శాతం ఫిట్‌మెంట్ అంటే రూ.12,750 కోట్లు భారం ప్రభుత్వంపై పడనుంది.

అయితే ఇందులో ప్రభుత్వం ఎంతమేర ఫిట్ మెంట్ ఇస్తుందోననేది చర్చనీయాంశమే. ఒకవేళ 30 శాతమే అయితే రూ. 7,500 కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డట్టే. రెండున్న రేండ్లు కావొస్తున్నా.. పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు పీఆర్సీని అమలుచేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడంలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పీఆర్సీ నివేదిక తెప్పించుకొని మంచి ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో అప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ, ఉపాధ్యాయులు అర్థం చేసుకొని రెండేళ్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తమ కార్యాచరణను ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ 9 తర్వాత తమ కార్యాచరణను మొదలుపెడతామని పీఆర్టీయూ టీఎస్ సంఘం, ఈ ఏడాది చివరి వరకు వేచి చూస్తామని కీలకమైన ఉద్యోగ సంఘం నేత ఒకరు పేర్కొన్నారు.