రాజీవ్ గృహకల్ప వద్ద ఆర్టీసీ బస్సు- టిప్పర్ ఢీ

15-09-2026 | 01:58pm

20 మందికి పైగా ప్రయాణికులకు గాయాలు

పలువురికి తీవ్ర గాయాలు

నాగోల్ , సెప్టెంబర్‌ 15: రాజీవ్ గృహకల్ప (RGK) కాలనీ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలనీ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సును మెయిన్‌ రోడ్డుపై వేగంగా వచ్చిన టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. టిప్పర్‌ ఢీకొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే కాలనీవాసులు, పోలీసులు స్పందించి బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు.

అనంతరం 108 అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలు, టిప్పర్‌ వేగం తదితర అంశాలపై వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు