02-10-2025 12:18:02 AM
కామారెడ్డి/బాన్సువాడ, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): కొత్త వైన్ షాపుల ఏర్పాటుకు సర్కారు పచ్చ జెండా ఊపడంతో మద్యం వ్యాపారులు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు మళ్లీ రెడీ అవుతున్నారు. మద్యం షాపులను దక్కించుకునేందుకు దరఖాస్తుల సమయంలోనే సిండికేట్ గా వైన్స్ మాఫియా ఏకమవుతున్నారు. మద్యం మాఫియా డాన్లు రంగ ప్రవేశం చేసి చక్రం తిప్పుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం సిండికేట్ వ్యాపారులు తమ ఆర్థిక పరిపుష్టి, పలుకుబడిన ఉపయోగించి లిక్కర్ దందాను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు మద్యం మాఫియా వైన్ వ్యాపారులతో కలిసి రహస్యంగా భేరసారాలు కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా కామారెడ్డి, నిజామా బాద్, బోధన్ ఆర్మూర్,ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల్లో నడుస్తున్న వైన్ వ్యాపారాలను బేరీజు వేసుకుంటున్నారు.
గడిచిన దినాల్లో ఏ ప్రాంతాల్లో అధికంగా క్రయవిక్రయాలు జరిగాయన్న విషయాన్ని పరిగణంలోకి తీసుకొని ఆయా ప్రాంతాల లో ఉన్న వైన్ షాపులపై మాఫియా దృష్టి పెడుతున్నారు. లిక్కర్ అధికంగా అమ్ముడుపోయే షాపులను చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా షాపులు రిజర్వేషన్ ప్రకారంగా ఉంటే బినామీ పేర్లపై కూడా టెండర్ వేసి సాహసం చేసేందుకు సిద్ధ మవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో గతంలో2023-2025 సంవత్సరానికి గాను మద్యం వ్యాపారులకు అధిక లాభార్జన జరిగింది. తిరిగి ప్రభుత్వం టెండర్ల కాలం ముగియడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వైన్ షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.26 సెప్టెంబర్ 2025 నుండి అక్టోబర్ 18వ తేదీ 2025 వరకు దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియను చేపడుతున్నారు. తదుపరి అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయింపు జరిపేందుకు ఎక్సెస్ శాఖ చర్యలు చేపట్టనున్నారు.
కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుండి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల పరిమితిగా నిర్ధారించారు. అయితే గడిచిన టెండర్లలో టెండర్లు వేసే ప్రతి వ్యక్తి రెండు లక్షల రూపాయలు మాత్రమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ దఫా ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు పెంచుతూ టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
కొత్తగా మద్యం దుకాణాల టెండర్ కు మూడు లక్షలు
కొత్త మద్యం దుకాణాలకు టెండర్లు వేసేందుకు ఉత్సాహాన్ని చూపే వ్యాపారులు ఒక్కో వైన్ షాప్ కోసం టెండర్ ఫీజు రూ.3 లక్షలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అట్టి డబ్బు తిరిగి చెల్లించే అవకాశం ఉండదు. టెండర్ల ప్రక్రియ అనంతరం 2025 డిసెంబర్ 1 న గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు ఐదు శాతం కింద మద్యం దుకాణాలు కేటాయించే విధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
దరఖాస్తులు పెరిగే ఛాన్స్...
ఈ దఫా జరిగే టెండర్లలో పోటీ దార్ల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ దందాల కొనసాగుతున్న వారే కాకుండా, ఇతరులు కూడా వైన్ షాప్ ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. తమ తమ ఏరియాలలో వైన్ షాపులను దక్కించుకునేందుకు ఇతర వ్యాపారాలకు చెందిన వ్యక్తులు కూడా టెండర్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
లిక్కర్ దందాలో లాభాలు ఎక్కువగా రావడంతో వైన్ వ్యాపారంలో కొనసాగేందుకు ఉత్సాహపడుతున్నారు. ఈ మేరకు వైన్ దందాలో ఉన్నవారితో పోటీపడేందుకు సైతం సిద్ధపడుతున్నారు. 2023-25 సంవత్సరానికి గాను క్రితం జరిగిన టెండర్లలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 3579 మంది వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2025- 27 కు సంబంధించి జరిగే టెండర్లలో పోటీదారుల సంఖ్య ఇంత పెరిగే అవకాశాలు స్పష్టమవుతున్నాయి.
దఫా 5000 వరకు టెండర్లు నమోదు కానున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాపులు నడుస్తున్నాయి. వీరి ద్వారా మరో వెయ్యికి పైగా షాపులు అనధికారికంగా( బ్లాక్ షాపులు) కొనసాగుతున్నాయి. ఈసారి లిక్కర్ వ్యాపారులతో కలిసి దందా చేసిన బ్లాక్ షాప్ మద్యం వ్యాపారులు కూడా టెండర్లలో పాల్గొనేందుకు సిద్ధహస్తులవుతున్నారు.
రిజర్వేషన్ షాపులపై దృష్టి..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లిక్కర్ మాఫియా రిజర్వేషన్ షాపులపై కూడా దృష్టి సారించింది. గౌడ్స్, ఎస్ టి, ఎస్ సి వర్గాలకు వచ్చే షాపులను కైవసం చేసుకునేందుకు ఆయా వర్గాలకు చెందిన నిరుపేద వ్యక్తులతో టెండర్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారు. వారి పేరిట షాపులను దక్కించుకొని దందాను నడుపుకునే ప్లాన్ వేస్తు న్నారు.
వారికి నయానో భయానో అప్పచెప్పి వారి పేరిట వైన్ షాపును పొంది లిక్కర్ దందాల కొనసాగేందుకు అనుకూలమైన వ్యక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా మద్యం సిండికేట్ మాఫియా రహస్య సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఎక్కువగా లిక్కర్ అమ్ముడుపోయే అడ్డాలపైనే దృష్టి పెడుతున్నారు. ఆ షాపులపై ఐదు నుండి 10 వరకు వేసేందుకు సైతం రంగం సిద్ధం చేస్తున్నారు.
నిరుద్యోగులు సైతo..
మద్యం సిండికేట్ మాఫియా నిరుద్యోగ యువకుల పేర్లతో టెండర్లలో భాగస్వాములను చేసే వాతావరణం కనిపిస్తోంది. వారి పేరిట కూడా షాపులను చేజిక్కించుకొని దందాను పెంపొందించుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారిపై కూడా ఒకటికి మించి ఐదు వరకు టెండర్ ఫారాలను వేసేందుకు తగిన పైకాన్ని సిద్ధం చేసుకుంటున్నారు.
ఉమ్మడి నిజామాబాద్,కామారెడ్డి జిల్లాలో ఈసారి జరిగే మద్యం టెండర్లలో మద్యం సిండికేట్ మాఫియా డాన్లు తమ ఉనికిని చాటుకొని పెద్ద మొత్తంలో షాపులను దక్కించుకోవడమే కాకుండా అధిక లాభాలను గడించేం దుకు ఉన్న అవకాశాలు అన్నింటిని వాడుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికా రులు సైతం లిక్కర్ మాఫియా కు ఎక్కడెక్కడ ఏ షాపులు దక్కించుకుంటే లాభాలు అర్జించవచ్చు అని విషయాలను అందజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
టెండర్ల ప్రక్రియలో ఎలాంటి మెలుకువలు పాటించా లో కూడా ఎక్సైజ్ అధికారులు తగు సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. మరి ఈసారి లిక్కర్ టెండర్లు మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోతాయా... కొత్తవారికి దక్కుతాయా.. లే దో. వేచి చూడాల్సిందే..
సిండికేట్‌గా మారే అవకాశం ఉండదు
వైన్సుల కోసం ఎవరైనా టెండర్ కు మూడు లక్షలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరు అడ్డుకునే ప్రసక్తి ఉండదు. ఎవరైనా అడ్డుకున్నట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా ఉంది. నిర్భయంగా వైన్సుల కోసం టెండర్ దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు.
- హనుమంతరావు, ఎక్సైజ్ సూపర్డెంట్, కామారెడ్డి