మరోసారి పోలీస్ అధికారిగా..
“పోలీస్ అధికారిగా ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా, మరోసారి పోలీస్ డ్రెస్ వేయడానికి ఈ సినిమా కథే కారణం” అని అన్నారు హీరో నవీన్ చంద్ర. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎలెవన్’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాకి లోకేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాకి అజ్మల్ ఖాన్, రెయా హరి నిర్మాతలు. ఆడుకాలం నరేన్, రవి వర్మ, కిరీటి దామరాజు, శశాంక్, రెయా హరి, అభిరామి కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
కాగా బధవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ “దర్శకుడు చెప్పినపుడు ఇదో తమిళ సినిమా అనే అనుకున్నా. అయితే నిర్మాతల సూచనతో రెండు భాషల్లో చేయడం జరిగింది. కిరీటి పాత్ర సినిమా కథని మలుపు తిప్పేలా ఉంటుంది. తెలుగు వారై ఉండి కూడా రవి వర్మ, శశాంక్, కిరీటి ఈ సినిమా కోసం తమిళం నేర్చుకున్నారు.” అని అన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాకి ప్రముఖ స్వరకర్త డి ఇమ్మాన్ సంగీతం అందించారు.






