తల్లి ఒడిలో నుంచి నెల రోజుల శిశువును కిడ్నాప్!
-ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
శేరిలింగంపల్లి,జూలై 3 (విజయక్రాంతి): లింగంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో తల్లి ఒడిలో నిద్రిస్తున్న నెల రోజుల శిశువును గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సర్కస్ ప్రదర్శనలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువ దంపతులు తమ నెల రోజుల పాపతో కలిసి లింగంపల్లి రైల్వేస్టేషన్ ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నారు. గత నెల 30వ తేదీ రాత్రి తల్లి తన పాపతో కలిసి అక్కడే నిద్రించింది. అర్ధరాత్రి మెలకువ వచ్చి చూసేసరికి శిశువు కనిపించలేదు.దంపతులు వెంటనే స్థానికంగా వెతికినా పాప ఆచూకీ లభించకపోవడంతో చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.ఫుటేజీలో ఒక వ్యక్తి ఆటోలో వచ్చి, నిద్రలో ఉన్న శిశువును తల్లి ఒడిలో నుంచి ఎత్తుకొని పారిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి, కిడ్నాపర్‌ను గుర్తించారు. ఆ వ్యక్తి శిశువును చాంద్రాయణగుట్ట లోని పిల్లలు లేని ఒక దంపతులకు అమ్మేసినట్లు తెలిసింది. పోలీసులు కిడ్నాప్ చేసిన వ్యక్తి శిశువును కొనుగోలు చేసిన దంపతులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. శిశువును సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






