1 April, 2026 | 1:52 AM

కులం పేరుతో దూషణ బెదిరింపుల కేసులో.. ముగ్గురు నిందితులకు సంవత్సరం జైలు

01-04-2026 12:19 AM

ఒక్కొక్కరికి రూ. 4,500 జరిమానా 

నిజామాబాద్ జిల్లా సెకండ్ అడిషనల్ జడ్జి శ్రీనివాస్ 

కామారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): కుల దూషణలు, బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష ఖాయం అని నిజామాబాద్ జిల్లా అడిషనల్ సెషన్స్ జడ్జి శ్రీనివాస్ మంగళవారం తీర్పు ఇచ్చారు. పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చేసిన అధికారులకు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, అభినందనలు తెలిపారు. నేటి సమాజంలో కులం పేరుతో వివక్ష చూపడం, వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడం అక్షరాలా నేరమని, అటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడే వారికి చట్టం ముందు ఎటువంటి ఉపశమనం ఉండదని ఈ తీర్పు మరొకసారి స్పష్టం చేసిందన్నారు. పిర్యాదుదారుడు మల్వత్ బాలు నాయక్, కామారెడ్డి పట్టణంలోని గోదాం రోడ్లో ‘దేవి ఐ కేర్ క్లినిక్ & ఆప్టికల్ షాప్‘ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.

అదే ప్రాంతంలో ఉన్న ‘లియో ఆప్టికల్స్ ఐ క్లినిక్‘ యజమాని నరసింహారెడ్డి, తన వ్యాపారం సరిగా నడవడం లేదనే భావంతో గత మూడు నెలలుగా పిర్యాదుదారుని వేధిస్తూ, ‘నువ్వు ఇక్కడ షాప్ పెట్టడం వల్ల నాకు వ్యాపారం దెబ్బతిన్నది, నీ అంతు చూస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. 19 ఏప్రిల్ 2022 ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో, పిర్యాదుదారుడు తన షాప్లో పనిచేస్తుండగా, నరసింహారెడ్డి తన సోదరులు రాజు, శ్యామ్లతో కలిసి షాప్లోకి బలవంతంగా ప్రవేశించి, షాప్లోని కుర్చీలు, అద్దాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం నరసింహారెడ్డి ఫ్లోర్ క్లీనింగ్ కట్టెతో పిర్యాదుదారునిపై దాడి చేసి, ప్రాణహాని కలిగిస్తానని బెదిరించాడు.

అతని సోదరులు రాజు, శ్యామ్లు కూడా పిర్యాదుదారునిపై దాడి చేశారు. ముగ్గురు నిందితులు కలిసి పిర్యాదుదారుని కులం పేరుతో అవమానకరంగా దూషించి, షాప్ నుంచి బయటకు లాగి రోడ్డుపై కూడా దాడి చేశారు. ఈ ఘటనపై  20 ఏప్రిల్ 2022 నాడు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు సమయంలో కుటుంబ సభ్యులు, కాలనీవాసులు, పరిసర ప్రాంతాల వారిని విచారించి, తగిన సాక్ష్యాధారాలను సేకరించారు.

అనంతరం నిందితులు సోమన్నగారి  నర్సింలు, సోమన్నగారి శ్యామ్, సోమన్నగారి రాజులను కామారెడ్డిలో అరెస్టు చేసి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసులో సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం, కులం పేరుతో దూషణ, బెదిరింపుల నేరాలు రుజువవడంతో, నిజామాబాద్ గౌరవ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జ్ SC,ST కోర్టు న్యాయమూర్తి టి. శ్రీనివాస్ ముగ్గురు నిందితులకు 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 4,500 జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించారు.

ఈ కేసులో పోలీసు తరఫున వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. దయాకర్ గౌడ్ ని, కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన అప్పటి కామారెడ్డి ఎస్‌ఐ జి. రాములు, అప్పటి కామారెడ్డి డీఎస్పీ ఎం. సోమనాథం, ప్రస్తుత కామారెడ్డి ఎస్హెచ్‌ఓ నరహరి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారులు ఏఎస్‌ఐ రాజేశ్వర్, శ్రీనివాస్, సీడీఓ ఎస్. విజయ్ కుమార్ ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,  అభినందించారు.