1 April, 2026 | 1:52 AM

అవగాహనతోనే ఎయిడ్స్ రహిత సమాజం సాధ్యం

01-04-2026 12:21 AM

కామారెడ్డి, మార్చి 31 (విజయక్రాంతి): తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని సమర్థవంతంగా నివారించవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్.ఎస్.ఎస్. ప్రాజెక్ట్ ఆఫీసర్ నరసింహ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల  వేదికగా, తెలంగాణ విశ్వవిద్యాలయ రెడ్ రిబ్బన్ క్లబ్, ఎన్.ఎస్.ఎస్. సంయుక్త ఆధ్వర్యంలో ‘హెచ్.ఐ.వి ఎయిడ్స్ నివారణ - యువత పాత్ర‘ అనే అంశంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింహగౌడ్ మాట్లాడుతూ, హెచ్.ఐ.వి పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయ దృక్పథంతో అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ వెంకట్ స్వామి మాట్లాడుతూ, హెచ్.ఐ.వి వైరస్ శరీరంలోని రోగ నిరోధక శక్తిని  ఎలా దెబ్బతీస్తుందో శాస్త్రీయంగా వివరించారు. సలహాలు లేదా సూచనలకు జాతీయ టోల్ ఫ్రీ నెంబర్ 1097 కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయకుమార్, తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ డాక్టర్ అపర్ణ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని కళాశాలల్లో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్యవంతమైన యువతను తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు, ధ్రువపత్రాలను అందజేశారు. కళాశాల సమన్వయకర్త డాక్టర్ పి విశ్వప్రసాద్, ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ పి. రాజ్ గంభీర్ రావు, డాక్టర్ శారద, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ జి. శ్రీనివాసరావు, సుధాకర్ పాల్గొన్నారు.  జిల్లా ఆరోగ్య అధికారి వేణుగోపాల్, సురక్ష స్వచ్ఛంద సంస్థ సభ్యులు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మాచారెడ్డి ప్రాంతాలకు చెందిన వివిధ డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రోగ్రాం ఆఫీసర్లు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.