రోజుకు 300 ఓపీ.. వైద్యులు మాత్రం నలుగురే!
- కోదాడ సర్కార్ దవాఖానను వేధిస్తున్న సిబ్బంది కొరత
- డెంగ్యూ, టైఫాయిడ్ కేసులతో పెరుగుతున్న ఓపీ
- పేదలకు అరకొర అందుతున్న వైద్యసేవలు
సూర్యాపేట/ కోదాడ, ఆగస్టు 24: సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో సుమారు 95 వేల మంది జనాభా ఉంది. వీరికి తోడు మండలవ్యాప్తంగా వేలాదిగా జనాభా ఉంటుంది. వీరిలో ఎక్కువ మంది నిరుపేదలే. వీరికి సుస్తి చేస్తే కోదాడలోని సర్కార్ దవాఖానకు వచ్చే వైద్యం చేయించుకోవాలి. గతంలో 30 పడకలు ఉన్నప్పుడు నలుగురు వైద్యులు మాత్రమే ప్రజలకు వైద్య సేవలు అందించేవారు. కానీ వంద పడకల ఆసుపత్రిగా మార్చినప్పటికీ నలుగురు వైద్యులు మాత్రమే వైద్యసేవలు అందిస్తుండడం గమనార్హం.
గతంలో 47 మంది వైద్యసిబ్బంది వైద్యసేవలు అందిస్తుండగా ప్రస్తుతం వారి సంఖ్య కూడా అంతే ఉంది. ఫిబ్రవరి 7న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అట్టహాసంగా వందల పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. కానీ ఆ తర్వాత ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుతం విష జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో దవాఖానకు ఓపీ రోజురోజుకూ పెరుగుతున్నది. రోజుకు 300 350 ఓపీ నమోదవుతున్నది. చాలినంత మంది వైద్యులు, సిబ్బంది నియమించకపోవవడంతో ప్రజలకు మెరుగైన చికిత్స అందడం లేదు.
వైద్య పరీక్షలకూ తప్పని నిరీక్షణ..
ప్రస్తుతం దవాఖానకు జ్వర పీడితులు ఎక్కువగా వస్తుండడంతో, ఆ లక్షణాలు ఉన్నవారికి వైద్యసిబ్బంది టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వైద్యపరీక్షలు చేస్తున్నారు. ల్యాబ్‌లో కూడా సిబ్బంది కొరత వేధిస్తుండడంతో అక్కడ రోగులు గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి. ప్రజలకు మెరుగైన వైద్యవ సేవలు అందాలంటే 42 మంది వైద్యులు, 118 మంది వైద్య సిబ్బంది అవసరమవుతాయని ఆసుపత్రి వర్గాలే తెలుపుతున్నాయి.
వైద్యులు ఎక్కువమంది ఉండాలె..
జ్వరాలు పెరుగుతుండడంతో దవాఖానకు ఎక్కువ మంది వస్తున్నరు. కానీ వైద్యులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నరు. ఉన్న వారైనా మంచి చికిత్స అందిస్తున్నారు. రోగుల సంఖ్యను బట్టి ఎక్కువ మంది వైద్యులు అందుబాటులో ఉంటే బాగుంటది. రక్త పరీక్షలు చేయించుకోవడానికీ ల్యాబ్ ముంగట గంటల కొద్దీ నించుకోవాల్సి వస్తున్నది. సిబ్బంది పరీక్షలు నిమ్మలంగ చేస్తున్నరు. వాళ్లు కూడా ఎక్కువ మంది ఉంటే మంచిగుంటది.
పిడమర్తి నాగమ్మ, గణపవరం, కోదాడ మండలం
నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి..
దవాఖానకు వచ్చే వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. గతంలో కంటే కంటే ఇప్పుడు ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. అయినా మేం అందరికీ వైద్యం అందేలా చూస్తున్నాం. చికిత్స అందించడంలో కొంత ఆలస్యమవుతున్న మాట వాస్తమే. కానీ మేం అందరికీ చికిత్స చేస్తున్నాం. దవాఖానాలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
దశరథనాయక్, ఆసుపత్రి సూపరింటెండెంట్, కోదాడ






