13 March, 2026 | 2:56 AM

జీవో 84కు మామూళ్ల గ్రహణం!

13-03-2026 12:00 AM
  1. అడ్వర్టైజ్మెంట్ వింగ్లో పది లక్షల దందా 
  2. పాలసీ ఉన్నా అక్రమార్జనకే అధికారుల మొగ్గు 
  3. శంషాబాద్ జోన్లో ఏజెన్సీ నుంచి భారీ లంచం డిమాండ్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 12 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు భారీగా ఆదాయం సమకూర్చడంతో పాటు, నగర రూపురేఖలను మార్చాలని ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన అడ్వర్టైజ్మెంట్ పాలసీ జీవో నెం. 84 అక్రమ సం పాదనకు అడ్డాగా మారింది. శంషాబాద్ జోన్లో ఒక అక్రమ ఏజెన్సీని కాపాడేందుకు సదరు విభాగంలోని ఒక ముఖ్య అధికారిణి ఏకంగా రూ. 10 లక్షల లంచం డిమాండ్ చేయడం ఇప్పుడు మున్సిపల్ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది.

ప్రాణాల కంటే పైసలే ముఖ్యం..

జీవో నంబర్ 84లో ప్రకటనల బోర్డుల సైజు, ఎత్తు, వెలుతురు తీవ్రత నిర్మాణ నాణ్యతపై అత్యంత కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్ల పక్కన ఏర్పాటు చేసే హోర్డింగ్లు వాహనదారుల ఏకాగ్రతను దెబ్బతీయకూడదని, గాలివానలకు కూలకూడదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కానీ, సోమాజీగూడ, పంజాగుట్ట, శంషాబాద్ వంటి రద్దీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న డిజిటల్ స్లైడ్స్ ఎల్‌ఈడీ బోర్డులు నిబంధనలను ఏమాత్రం పాటించడం లేదు. వీటి వెలుతురు వాహనదారుల కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించినప్పుడు మాత్రమే అధికారులు మేల్కొంటారా.. అని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమాలకు నిలయంగా శంషాబాద్ జోన్..

కొత్తగా ఏర్పడిన శంషాబాద్ జోన్ పరిధిలో అడ్వర్టైజ్మెంట్ మాఫియా ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తోంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో యూనిపోల్స్, హోర్డింగ్లు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించడం లేదా తొలగించడం చేయాల్సిన అధికారులు, ఏజెన్సీల నుండి వసూళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జోన్లోని ఒక ఏజెన్సీ నుంచి అడ్వర్టైజ్మెంట్ విభాగంలోని ఒక ఉన్నతాధికారిణి రూ. 10 లక్షలు లంచం డిమాండ్ చేయడం చూస్తుంటే అక్రమాల స్థాయి ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. డీ ఫేస్మెంట్ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా, పర్యవేక్షించాల్సిన రెవెన్యూ విభాగం ఏజెన్సీలతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని మౌనం వహిస్తోంది.

మూడు కార్పొరేషన్లకు ఆదాయం ఎక్కడ..

జీహెచ్‌ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి కార్పొరేషన్లకు ఈ అడ్వర్టైజ్మెంట్ పాలసీ ద్వారా భారీ ఆదాయం సమకూరాల్సి ఉంది. కానీ, అధికారుల ధనదాహానికి ఈ నిధులన్నీ పక్కదారి పడుతున్నాయి.అక్రమ బోర్డులను గుర్తించి జరిమానాలు విధిస్తే కార్పొరేషన్ల ఖజానా నిండుతుంది.. కానీ ఆ డబ్బు అధికారుల జేబుల్లోకి వెళ్తోంది అని సదరు విభాగంలోని కొందరు అధికారులే బాహాటంగా చర్చించుకుంటున్నారు.

సాంకేతిక మోసం.. ఐన్ నెంబర్లతో మాయాజాలం..

గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి హోర్డింగ్ లేదా యూనిపోల్‌కు ఒక ప్రత్యేకమైన అడ్వర్టైజ్మెంట్ ఇండెక్స్ నెంబర్ కేటా యించాలి. కానీ, అడ్వర్టైజ్మెంట్ వింగ్ అధికారులు ఈ నెంబర్ల కేటాయింపులో భారీ అక్ర మాలకు తెరలేపారు. ఒకే ఏఐఎన్ నెంబరుకు ఒకటి కంటే ఎక్కువ హోర్డింగ్లను, యూనిపోల్స్‌ను లింకు చేస్తూ బ్యాక్ డోర్ లో అక్రమ ప్రకటనలకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డిం గ్లను గుర్తించి తొలగించాల్సింది పోయి, పాత నెంబర్లను వాటికి తగిలించి కార్పొరేషన్ ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనివల్ల వందల సంఖ్యలో హోర్డింగ్లు ఉన్నా, కాగితాల్లో మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నట్లు చూపిస్తూ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు.