15 May, 2026 | 3:27 AM

అవయవదానం సమాజానికి మార్గదర్శకం

15-05-2026 02:07 AM

సూర్యాపేట, మే 14 (విజయక్రాంతి) :  అవయవ దానం సమాజానికి మార్గదర్శకం అని స్పందన సేవా సంస్థ సభ్యులు అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ లో నివాసం ఉంటున్న వలవోజు రమేష్ తన మరణానంతరం విద్యార్థుల వైద్య పరిశోధన నిమిత్తం అవయవ దానానికి తన అంగీకారాన్ని తెలియజేస్తూ స్పందన శరీర, అవయవ దాన సంస్థ సభ్యులకు అంగీకార పత్రాన్ని అందజేశారు.

తన అనారోగ్యం దృష్ట్యా దివంగతులైన పిదప సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని సత్సంకల్పంతో అవయవదానానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అనంతరం స్పందన అవయవదాన సంస్థ అధ్యక్ష కార్యదర్శులు, గుండా రమేష్, మిట్ట కోల కోటయ్య, కోశాధికారి హెచ్. పిచ్చి రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆదర్శ సామాజిక సేవ అవయవదానం పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా అవయవదాన పత్రాన్ని వలవోజు రమేష్ సోదరుడు వలవోజు వెంకన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.