13 April, 2026 | 1:41 AM

సోలార్ దీపాలు మాయం.. కంచెలు హరీ..!

13-04-2026 12:00 AM
  1. అశ్వాపురం మండలంలో అనాథలైన వనాలు.
  2. హరితహారం లక్ష్యం నీరుగారుతోంది.. అశ్వాపురం మండలంలో పడకేసిన పర్యవేక్షణ.
  3. దొంగల పాలవుతున్న ప్రకృతి సొత్తు.. ప్రజాప్రతినిధుల మౌనం ఎవరి కోసం?
  4. అశ్వాపురం మండలంలోని పంచాయతీల్లో తీవ్ర నిర్లక్ష్యం
  5. పశువుల మేతకు నిలయాలుగా మారిన హరిత వనాలు  ఎండిపోతున్న మొక్కలు
  6. దొంగల పాలవుతున్న ఇనుప కంచెలు.. సోలార్ దీపాలు కూడా మాయం!

అశ్వాపురం, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, లక్షలాది రూపాయల నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన ’పల్లె ప్రకృతి వనాలు’ అశ్వాపురం మండలంలో ప్రస్తుతం అనాథలుగా మారుతున్నాయి. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడం, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ హరిత యజ్ఞం.. అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారిపోతోంది. మండలంలోని  గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న వనాలు ఇప్పుడు పశువుల మేత స్థలాలుగా మారిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

చీకటిమయమైన వనాలు: సోలార్ దీపాలు మాయం

పకృతి వనాల్లో రాత్రి వేళ వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేసిన సోలార్ దీపాలు సైతం దొంగల పాలవుతున్నాయి. అధికారుల నిఘా లోపంతో అపహరణకు గురవుతున్న ఈ విలువైన పరికరాల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. వనాల చుట్టూ రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు కూడా కొన్ని చోట్ల దొంగల పాలయ్యాయి. కంచెలు లేకపోవడంతో ఆవులు, మేకలు, ఎద్దులు స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించి వేల రూపాయలు వెచ్చించి నాటిన మొక్కలను నాశనం చేస్తున్నాయి.

అడవిగా మారిన వనాలు.. అధికారుల నిర్లక్ష్యం

పర్యవేక్షణ కరువవడంతో కొన్ని ప్రాంతాల్లో ఈ వనాలు దట్టమైన అడవిని తలపిస్తుండగా, మరికొన్ని చోట్ల నీటి సదుపాయం లేక మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కొత్త సర్పంచులు కూడా ఈ వనాల సంరక్షణపై దృష్టి సారించకపోవడంపై గ్రామస్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పారిశుధ్యం, పచ్చదనంపై దృష్టి సారించాల్సిన ప్రజాప్రతినిధులు చేతులెత్తేయడం బాధాకరమని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలు తీసుకోకుంటే బోర్డులకే పరిమితం!

ప్రతి పంచాయతీలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి, కంచెల మరమ్మతులు చేపట్టడంతో పాటు గార్డులను నియమించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆశించిన హరితహారం లక్ష్యం నెరవేరాలంటే మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో ఈ వనాలు కేవలం బోర్డులకే పరిమితమై, ప్రభుత్వ నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతాయని పౌర సమాజం హెచ్చరిస్తోంది.