13 April, 2026 | 1:54 AM

కట్టలేరుకు మంచి రోజులు

13-04-2026 12:00 AM
  1. రూ.36.50 లక్షలతో కట్టలేరు పనులకు శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క మల్లు. 
  2. అభివృద్ధి పనులతో పెరగనున్న భూగర్భ జలం. 
  3. పూడిక తీత అభివృద్ధి పనులతో రైతులకు సాగునీరు 
  4. అందించేందుకు శ్రీకారం. రైతులు ఆనందోత్సవాలు.
  5. కుడి ఎడమ కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు.
  6. హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ, మండల రైతులు.

ఎర్రుపాలెం, ఏప్రియల్ 12 (విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలంలోని కట్టలేరు నదికి మంచి రోజులు రానున్నాయి. కట్టలేరు నది కుడి ఎడమ కాలువల పూడికతీత పనులతో కట్టలేరు కు శాశ్వతంగా నీరు అందించేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎర్రుపాలెం మండల రైతాంగానికి పంటలు సమృద్ధిగా పండించేందుకు ములుగుమాడు గ్రామం వద్ద కట్టలేరు కుడి ఎడమ కాలువల పూడిక తీత పనులు కోసం 36. 50 లక్షల నిధులతో శాశ్వతంగా సాగునీటిని అందించే పూడిక తీత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

మధిర నియోజకవర్గంలో రైతాంగానికి గతంలో సాగర్ జలాల ద్వారా మాత్రమే సాగునీరు అందేది. ఈ సాగర్ జలాలు కూడా మూడవ ఆయు కట్టనుండి అరకొర జలాలు రైతులకు అందేవి. బట్టి విక్రమార్క ముందుచూపుతో రైతులను అభివృద్ధి లోకి తీసుకు వచ్చేందుకు, మున్నేరు, వైరా, కట్టలేరు పై శాశ్వత సాగున నీటి పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని సాగర్ మూడవ ఆయకట్టు లో ఉన్న ఎర్రుపాలెం మండలాన్ని రెండో ఆయకట్టు క్రిందకు మార్చి నీటిని అందించాలని అనేక సాగునీటి పథకాలను రూపొందిస్తున్నారు.

ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వత సాగునీరు పథకాలను రూపొందిస్తుంది . వైరా నదిపై వంగమూడి వద్ద ఆనకట్టను నిర్మించి నీటిని ఎత్తిపోతల ద్వారా శాశ్వతంగా ఎర్రుపాలెం మండలానికి సాగు నీటిని అందించేందుకు ప్రణాళికలను రూపొందించి ఈ ప్రాంత రైతాంగానికి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకున్నది. అందులో భాగంగా కట్టలేరు కుడి ఎడమ కాలువల పూడికతో నిండి ఉండటం వలన ప్రజా ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కట్టలేరుకు నిధులను కేటాయించి పనులకు శ్రీకారం చుట్టారు. దీనితో కట్టలేరుకు శాశ్వతంగా నీరును అందించేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనితో కట్టలేరుకు మంచి రోజులు రాబోతున్నాయి.

ఎర్రుపాలెం మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మండల కాంగ్రెస్ పార్టీ ఈ సాగునీటి పథకం వలన రైతుల ఆయకట్టు పెరిగి మండల రైతాంగం అభివృద్ధిలోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే కట్టలేరు నదిలో ఇసుక రవాణా వలన కట్టలేరుకు రెండు వైపులా ఉన్న రైతుల పొలాలలో ఉన్న బోరుబావులలో, చిన్నపాటి చెరువులలో ఉన్న భూగర్భ జలం అడుగంటకపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎండాకాలం లో భూగర్భ జలం మరింత లోతుకు వెళ్లే ప్రమాదం ఉంది. ఎండాకాలంలో కట్టలేరు లో ఉన్న కొద్దిపాటి నీరు పశువుల  త్రాగటానికి, రైతులు తమ కొద్దిపాటి మొక్కజొన్న, అరటి, వరి పంటలను కాపాడుకోవడానికి తమ పంటలను పండించేందుకు సాగునీరు అవసరం అవుతుంది.

కట్టలేరులో ఈ కొద్దిపాటి నీటిని కాపాడాలి అంటే ఇసుక తరలించకపోయే వారిపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచి అక్రమ ఇసుకసురుల ఆగడాలపై ఉక్కు పాదం మోపాలని మండల రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం  రైతులకు ఎన్ని సాగునీటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ పర్యవేక్షణ లేకపోతే అవి రైతులకు ఉపయోగంలోకి రావు. కట్టలేరు పూడికతీత పనులపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు మరింత తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని లేకపోతే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని మండల రైతులు పేర్కొన్నారు.