24 March, 2026 | 3:27 AM

సీఎం, డిప్యూటీ సీఎంలకు ఓయూ వీసీ కృతజ్ఞతలు

24-03-2026 12:19 AM

సికింద్రాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): రాష్ట్ర బడ్జెట్‌లో ఉస్మానియా విశ్వ విద్యాలయానికి భారీ ఎత్తున నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కలకు ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగరం కృతజ్ఞతలు తెలిపారు. ఓయూకు రెండు సార్లు రావటమే కాకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి. మౌళిక వసతుల కల్పనకు వెయ్యి కోట్ల నిధులు కేటాయించటం గర్వించదగ్గ విషయమని స్పష్టం చేశారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ పురోభివృద్ధికి ప్రభుత్వానికున్న చిత్తశుద్ది, దార్షనికత, పట్టుదల బడ్జెట్ ద్వారా సుస్పష్టమైందని ప్రొఫెసర్ కుమార్ వివరించారు. రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలోఉస్మానియా విశ్వవిద్యాలయ సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించడం ప్రభుత్వ ఉన్నత విద్య అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృక్పథానికి నిదర్శమని ప్రొఫెసర్ కుమార్ అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయి విద్యా పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్న నిబద్ధతకు ఈ నిధుల కేటాయింపే ఉదాహరణగా పేర్కొన్నారు.  రాష్ట్ర అభివృద్ధి ఎజెండాలో విద్యా రంగాన్ని అగ్రస్థానంలో ఉంచడంలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క నాయకత్వం ఎంతో కీలకమని ప్రొఫెసర్ కుమార్ కొనియాడారు.