మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం
- గ్రామాలభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల కీలకం
- మంత్రి ధనసరి అనసూయ
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని, ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగులు వారధిగా పని చేయాలని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో పంచాయతీ సెక్రటరీస్ సెంట్రల్ ఫోరం డైరీ, క్యాలండర్‌ను మంత్రి సీతక్క శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సెంట్రల్ ఫోరం సభ్యులను అభినం దించిన మంత్రి సీతక్క.. గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు ఇస్తున్నామని, జీవో నెం.317 కారణంగా స్థానికత కోల్పోయి దూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 223 మంది పంచాయతీ కార్యదర్శులకు రెండు సంవత్సరాల పాటు అంతర్ జిల్లా డిప్యూటేషన్‌పై నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు.
స్పోర్ట్స్ కోటలో తొలగించిన పంచాయతీ కార్యదర్శులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్టు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క కృషి వల్లే హెల్త్ కార్డులు, జీవో నెం.317 డిప్యుటేషన్ లు సాధ్యమయ్యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సందిల బలరాం తెలియజేశారు.
కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షులు, టీజీఈజేఏసీ చైర్మన్ మా రం జగదీశ్వర్, జనరల్ సెక్రెటరీ ఎస్ యం. హుస్సేని ముజీబ్, టీపీఎస్‌సీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సందిల బలరాం, కార్యదర్శి వెంకట రమణ,అసోసియేట్ అధ్యక్షుడు రఫీ, ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, రమాదేవి, జాయిం ట్ సెక్రటరీ బాల్ రాజ్ పాల్గొన్నారు.




