1.85 లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్

06-05-2024 12:17:20 AM

న్యూఢిల్లీ, మే 5: ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.85 లక్షలకుపైగా కంపెనీలు కొత్తగా రిజిష్టర్ అయ్యాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో వివరాల ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో 1,85,312 కంపెనీలు రిజిష్టర్ అయ్యాయి. వాటి చెల్లింపు మూలధనం రూ.30,927 కోట్లు. ఈ ఏడాది మార్చి నెలలోనే 16,600 కొత్త కంపెనీలు నమోదయ్యా యి. 2022 రూ.18,132 కోట్ల పెయిడ్‌అప్ క్యాపిటల్‌తో 1,59,524 కంపెనీల రిజి ష్టర్ అయ్యాయి. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నమోదైన కంపెనీల్లో 71 శాతం సర్వీసుల రంగానికి చెందినవే. 23 శాతం పారిశ్రామిక రంగంలోనూ, 6 శాతం వ్యవసాయ రంగంలోనూ నమోదయ్యాయి. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సర్వీసు రంగ కంపెనీల రిజిస్ట్రేషన్ 11 శాతం వృద్ధిచెందినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

33 శాతం మహిళా డైరెక్టర్లు

మార్చి నెలలో 42,041 డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్లు రిజిష్టర్ అయ్యాయని, అందులో 33 శాతం మంది మహిళలని బులెటిన్ వెల్లడించింది. కొత్తగా రిజిష్టర్ అయిన డైరెక్టర్లలో 43 శాతం 31 సంవత్సరాల మధ్య వయసువారని, 7 శాతంపైగా నూతన డైరెక్టర్ రిజిస్ట్రేషన్లు 60 ఏండ్లుపైబడిన వారివని పేర్కొంది. 2024 మార్చి చివరినాటికి దేశంలో మొత్తం 26,63,016 లక్షల కంపెనీలు ఉండగా, అందులో యాక్టివ్‌గా పనిచేస్తున్నవి 16,91,495 కంపెనీలని బులెటిన్ తెలిపింది. 27,022 కంపెనీల అధికారిక రికార్డుల నుంచి తొలగించే ప్రక్రియ లో ఉన్నాయని పేర్కొంది.