ఒడిదుడుకుల బాటలో మార్కెట్

06-05-2024 12:20:10 AM

ఈ వారం సూచీల కదలికలపై నిపుణుల అంచనాలు

న్యూఢిల్లీ, మే 5: వచ్చే కొద్ది రోజుల్లో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు పెరుగుతాయని, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై విభిన్న అంచనాలకు అనుగుణంగా ఈక్విటీలు హెచ్చు తగ్గులకు లోనవుతాయని విశ్లేషకులు అంచ నా వేస్తున్నారు. గత శుక్రవారం ఓలటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) భారీగా పెరగడం ఒడిదుడుకుల బాటలోనే ఈ వారం మార్కెట్ పయనిస్తుందనడానికి సంకేతమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి 75,123 పాయింట్ల సమీపానికి చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22,794 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. 

అయితే ఆ స్థాయిల నుంచి పతనమయ్యింది. యూఎస్ కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గవన్న భయాలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మార్కెట్‌ను గరిష్ఠస్థాయి నుంచి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుచేశాయి. శుక్రవారం ఐటీ, బ్యాంకింగ్ షేర్లు శుక్రవారం అమ్మకాల ఒత్తిడికి లోనైనప్పటికీ, ఇతర రంగాల షేర్లు స్థిరంగానే ముగిసినందున, డౌన్‌ట్రెండ్ తీవ్రంగా ఉండకపోవచ్చని, ఎన్నికలకు సంబంధించి పొజిష న్లలో ఇన్వెస్టర్లు మార్పుచేర్పులు చేస్తున్నందున, ఇంట్రాడే ఒడిదుడుకులు కొనసాగ వచ్చని విశ్లేషకులు వివరించారు. 

యూఎస్ జాబ్స్ డాటా స్టాక్స్‌కు పాజిటివ్..

ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతలు గత అంచనాలకంటే తక్కువగా ఉంటాయని ఫెడ్ సంకేతాలిచ్చినప్పటికీ, వారాంతంలో వెలువడిన యూఎస్ జాబ్స్ డేటా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్టు సూచించడంతో రేట్ల కోతలు తప్పనిసరి అవుతుందని విజయ్‌కుమార్ వివరించారు. అమెరికాలో ఉద్యోగ కల్పన, వేతన వృద్ధి తగ్గినట్టు తాజాగా వెల్లడైన జాబ్స్ డేటా స్టాక్ మార్కెట్ కోణంలో మంచిదేనని స్ట్రాటజిస్ట్ విశ్లేషించారు. శుక్రవారం రాత్రి జాబ్స్ డేటా వెలువడిన తర్వాత అమెరికా స్టాక్ సూచీలు భారీగా లాభపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ వారం భారత్ సూచీల కదలికల్ని నిర్దేశించే కీలక అంశాలివే. 

అంతర్జాతీయ మార్కెట్లు: అమెరికాలో పెద్ద టెక్నాలజీ షేర్లు పటిష్ఠమైన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో  గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగానే ట్రేడవుతున్నాయి. మే తొలివారంలో యూఎస్ డోజోన్స్ ఇండస్ట్రియల్ సూచి 1.14 శాతం, నాస్‌డాక్ 0.97 శాతం చొప్పున పెరిగాయి. యూస్ బాండ్ ఈల్డ్స్, డాలరు తగ్గుముఖం పట్టడం మార్కెట్‌కు బలాన్ని ఇచ్చింది. ఈ అంశాల్ని వచ్చేవారం భారత్ మార్కెట్‌పై సైతం ప్రభావం చూపిస్తాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలిపారు. 

ఎఫ్‌పీఐ పెట్టుబడులు: మే నెలలో తొలి రెండు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఈక్విటీల్లో రూ.1,156 కోట్లు నికర పెట్టుబడి చేయగా, రూ.1,726 కోట్లు డెట్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు. యూఎస్ బాండ్ ఈల్డ్స్‌లో మార్పులకు అనుగుణంగా ఎఫ్‌పీఐలు స్పందిస్తారని, ఈల్డ్స్ తగ్గితే భారత్ మార్కెట్లో వారు తిరిగి భారీ కొనుగోళ్లు జరుపుతారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ వివరించారు.

గ్లోబల్ డేటా: మే 9న వెలువడే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్ల నిర్ణయం, యూఎస్ జాబ్‌లెస్ క్లెయింల గణాంకాలు సైతం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని చెపుతున్నారు. 

కార్పొరేట్ ఫలితాలు. ఈ వీకెండ్‌లో వెల్లడైన కోటక్ మహీంద్రా బ్యాంక్, డీమార్ట్, ఐడీబీఐ బ్యాంక్ ఫలితాలపై సోమవారం ట్రేడింగ్ ప్రారంభంకాగానే మార్కెట్ స్పందిస్తుంది. ఇక ఈ వారం వెలువడనున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ సూచీల ట్రెండ్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెపుతున్నారు.

నిఫ్టీ 22,400లోపు  ముగిస్తే డౌన్‌ట్రెండ్ 

టెక్నికల్‌గా నిఫ్టీ వీక్లీ చార్టుల్లో బేరిష్ గ్రేవ్‌స్టోన్ డోజీ తరహా ప్యాట్రన్‌ను ప్రదర్శించినందున, ఈ వారం గరిష్ఠ స్థాయి ల్లో అమ్మకాల ఒత్తిడి ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ అనలిస్ట్ అజిత్ మిశ్రా తెలిపారు. నిఫ్టీ 22,400 పాయింట్లలోపు ముగిస్తే మరింతగా క్షీణించి 22,200 21,850 శ్రేణికి తగ్గవచ్చని మిశ్రా అంచనా వేశారు. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్ అప్‌ట్రెండ్‌లో ఉన్నప్పటికీ, వొలటాలిటీ ఇండెక్స్ భారీగా పెరగడం ఇన్వెస్టర్ల ముందుజాగ్రత్తను సూచిస్తున్నదన్నారు. ఈ వారం మార్కెట్ పెరిగితే 22,750 సమీపంలో అవరోధం కలగవచ్చన్నారు. ఈ వారం నిఫ్టీకి ముఖ్యమైన మద్దతుస్థాయిలు 22,405, 22,285 పాయింట్ల స్థాయిలని, పెరిగితే తక్షణ నిరోధం 22,650 సమీపంలో ఉన్నదని ప్రొగ్రెసివ్ షేర్స్ డైరెక్టర్ ఆదిత్యా గగ్గర్ అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 22,200 22,800 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని జేఎం ఫైనాన్షి యల్ అనలిస్ట్ తేజాస్ షా అంచనాల్ని వెల్లడించారు.