4 August, 2026 | 1:28 AM

2.70 కోట్ల ధాన్యం గల్లంతు

04-08-2026 12:00 AM
  1. బడా రైస్ మిల్లర్ అరెస్టు 
  2. కేసముద్రంలో కలకలం 

కేసముద్రం, ఆగస్టు 3 (విజయక్రాంతి): సీఎంఆర్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యంలో 2.70 కోట్ల ధాన్యం గల్లంతైన ఘటనపై కేసముద్రం మండల కేంద్రంలోని ఓ బడా రైస్  మిల్లు యజమాని తోట వెంకటేష్ ను పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. సీ ఎం ఆర్ రైస్ వ్యవహారంలో  ఇప్పటివరకు ఉదాసీనంగా వ్యవహరించిన ప్రభుత్వం అక్రమాలకు పాల్పడ్డ రైస్ మిల్లర్లపై చర్యలకు పూనుకోవడం, ఏకంగా ఓ పెద్ద రైస్ మిల్లు యజమానిని అరెస్టు చేయడం,

అతని తల్లిని కూడా అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేయడం కేసముద్రం వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర సివిల్ సప్లై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కేసముద్రం బాలాజీ పార్ బాయిల్డ్, తిరుమల రైస్ మిల్లులో కూడా సీఎంఆర్ ధాన్యం నిలువలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపారు.

ఇందులో సదరు మిల్లుల యజమానికి కేటాయించిన దాన్యంలో 2.70 కోట్ల ధాన్యం తో పాటు అనుబంధ మిల్లులో 25 లక్షల విలువైన ధాన్యం గల్లంతైనట్లు గుర్తించారు. ఈ సంఘటనలో మిల్లు యజమాని, అతని తల్లి పై క్రిమినల్ కేసులు నమోదు కు ఆదేశించారు. ఈ కేసులో తల్లిని అరెస్టు చేసి వెంటనే బెయిల్ పై విడుదల చేయగా, కొడుకు మాత్రం కొద్దిరోజులు తప్పించుకొని తిరుగుతుండగా నాలుగు రోజుల క్రితం పోలీసులు చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు.

ఈ క్రమంలో ఇటీవల సివిల్ సప్లై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ నేతృత్వంలో డిఫాల్ట్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆగస్టు 5లోగా బకాయి పూర్తిగా చెల్లించాలని, లేనిపక్షంలో బియ్యం రికవరీ కోసం చట్టపరమైన తీసుకుంటామని గట్టిగానే హెచ్చరించారు. కేసముద్రంలో 2022 - 23 సంవత్సరంలో ప్రభుత్వం నుండి ధాన్యం తీసుకొని సీఎంఆర్ కింద బియ్యం పట్టించి ఇస్తామని ఇప్పటివరకు ఇవ్వకుండా కొందరు మిల్లర్లు ముఖం చాటేశారు. సుమారు 80 కోట్ల రూపాయలు పైగా ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఈ క్రమంలో ‘పెద్ద’ మిల్లుగా కేసముద్రంలో గుర్తింపు పొందిన రైస్ మిల్లర్ ను అరెస్టు చేయడంతో డిఫాల్ట్ మిల్లర్ల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. అలాగే ఇంతకాలం సీఎంఆర్ ధాన్యంతో రైస్ మిల్లులు నడిపి ఆడింది ఆట పాడింది పాటగా సాగిన రైస్ మిల్లర్ల వ్యవహారం పై  ప్రభుత్వ చర్యలతో మిల్లర్లు ఉలిక్కిపడుతున్నారు. 2025-26 వానాకాలం, యాసంగి సీజన్లలో కూడా సీఎంఆర్ కోసం మిల్లర్లకు ప్రభుత్వం ధాన్యం వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేటాయించగా, అందులో చాలా ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ చర్యలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న బెంగతో అడ్డదారి తొక్కిన రైస్ మిల్లర్లు బీతిల్లుతున్నట్లు ప్రచారం సాగుతోంది.