4 August, 2026 | 1:45 AM

కాకతీయ వైభవానికి కేంద్రం పెద్దపీట వేయాలి

04-08-2026 12:00 AM

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన కాకతీయ వారసత్వ పరిరక్షణ, అభివృద్ధి అంశాన్ని లోక్సభ వేదికగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య బలంగా ప్రశ్నించారు. కాకతీయుల చరిత్ర, సంస్కృతి, కళా వైభవం కేవలం తెలంగాణకే కాకుండా దేశానికి గర్వ కారణమని, అలాంటి వారసత్వ సంపదకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

కాకతీయ వారసత్వ పరిరక్షణ, అభివృద్ధి పై పార్లమెంట్ లో ఎంపీ కావ్య ప్రభుత్వం దృష్టికి అనేక అంశాలను తీసుకెళ్లారు. ప్రధానంగా వరంగల్కు చరిత్రక గుర్తింపుగా నిలిచిన కాకతీయ కట్టడాలు, సంప్రదాయ కళలు, చేనేత, హస్తకళలు, సాంస్కృతిక ఉత్సవాలు, పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకుందో వివరించాలని ఎంపీ కోరారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమాధానం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) పరిధిలో 9 రక్షిత కట్టడాలు ఉన్నాయని, వాటిలో వరంగల్ జిల్లాకు చెందిన కాకతీయ వారసత్వ కట్టడాలు కూడా ఉన్నాయని తెలిపారు. అవసరాలు, నిధుల లభ్యత మేరకు వాటి పరిరక్షణ, నిర్వహణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఎంపీ మాట్లాడుతూ ‘ప్రసాద్’ పథకం కింద రామప్ప దేవాలయ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించడం సానుకూల పరిణామమే అయినప్పటికీ, కాకతీయ వారసత్వానికి సంబంధించిన అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కేంద్రం రూపొందించాలన్నారు.

కాకతీయుల చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రత్యేక సాంస్కృతిక, పర్యాటక ప్రాజెక్టులు చేపట్టాలని కోరారు. వరంగల్ కోట అభివృద్ధికి ఏఎస్‌ఐ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మధ్య ఒప్పందం కుదరడం స్వాగతించదగ్గ విషయమని, అయితే పనులు కాగితాలకే పరిమితం కాకుండా త్వరితగతిన పూర్తయ్యేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు.