18 May, 2026 | 1:32 AM

25న పద్మ అవార్డుల ప్రదానం

18-05-2026 12:33 AM
  1. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మందికి పద్మశ్రీ
  2. తెలంగాణ నుంచి ఏడుగురు, ఏపీ నుంచి నలుగురికి

న్యూడిల్లీ, మే 17: న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ నెల 25న పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్రం ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం ఎంపిక చేసింది. 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.

పద్మ విభూషణ్ వరించిన వారిలో కళారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన ధర్మేంద్రసింగ్ డియోల్ (మరణానంతరం), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎన్.రాజం, ప్రజావ్యవహారాలు విభాగం నుంచి కేరళంకు చెందిన కేటీ థామస్, వీఎస్ అచ్యుతానందన్ (మరణానంతరం), సాహి త్యం, విద్య విభాగాల నుంచి కేరళంకు చెంది న పీ నారాయణన్ ఉన్నారు. పద్మ భూషణ్ వరించిన వారిలో ఆల్కా యాగ్నిక్,  భాగత్ సింగ్ కోశ్యారి, కాళిపట్టి రామస్వామి పళనిస్వామి, మమ్ముట్టి, డా.నోరి దత్తాత్రేయుడు, పీయూష్‌పాండే (మరణానంతరం), ఎస్ కే మైలానందన్, శతావధాని ఆర్ గణేశ్, శిబు సోరెన్ (మరణానంతరం), ఉదయ్ కోటక్, వీకే మల్హోత్రా (మరణానంతరం), వెల్లప్పల్లి నటేశన్, విజయ్ అమృతరాజ్ ఉన్నారు. 

ఇక మొత్తం 113 మందికి పద్మశ్రీ అవార్డులు రాగా, ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో దాదాపు 11 మంది ప్రముఖులు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి శాస్త్రసాంకేతిక రంగం నుంచి గడ్డమానుగు చంద్రమౌళి, కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్, కుమారస్వామి తంగరాజ్, కళారంగం నుంచి దీపికారెడ్డి, వైద్యరంగం నుంచి గుడూరు వెంకట్రావు, విజయ్ ఆనంద్‌రెడ్డి, పశుపోషణ విభాగంలో మామిడి రామారెడ్డి (మరణానంతరం) ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కళారంగం నుంచి నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, గరిమెల్ల బాలకృష్ణప్రసాద్(మరణానంతరం),నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్, సాహి త్యం, విద్యారంగాల నుంచి వెంపటి కుటుంబ శాస్త్రి ఉన్నారు.