calender_icon.png 16 February, 2026 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివతాండవం

16-02-2026 12:08:17 AM

భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తు

ఇషాన్ కిషన్ విధ్వంసం

సమిష్టిగా రాణించిన బౌలర్లు

హ్యాట్రిక్ విజయంతో సూపర్ భారత్

వేదిక మారినా ఫలితం మారలేదు.. టోర్నీ మారినా ఆధిపత్యం మారలేదు..ఐసీసీ టోర్నీల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ జైత్రయాత్ర కొనసాగిన వేళ టీ20 ప్రపంచకప్‌లో మరోసారి దాయాది దేశాన్ని చిత్తు చేసింది. బ్యాటింగ్ ఇషాన్ కిషన్ శివమెత్తగా.. బౌలింగ్‌లో బుమ్రా, స్పిన్నర్లు రఫ్ఫాడించారు. ఫలితంగా కొలంబోలో శివరాత్రి రోజు శివతాండవం ఆడిన టీమిండియా వరుసగా మూడో విజయంతో సూపర్ 8కు దూసుకెళ్ళింది. ఇషాన్ కిషన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

కొలంబో, ఫిబ్రవరి 15: ఈ మ్యాచ్‌లో ఊహించినట్టుగానే భారత తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అభిషేక్ శర్మ జట్టులోకి తిరిగి రాగా.. అర్షదీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది. కొలంబో స్లో పిచ్ కావడంతో ఇరు జట్లు స్పిన్ వ్యూహంతోనే  బరిలోకి దిగాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌటయ్యాడు. అయితే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టారు.

రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్‌తో అతన్ని కట్టడి చేద్దామనుకున్న పాక్ ఆశలు నెరవేరలేదు. విధ్వంసకర బ్యాటింగ్ ఆడిన ఇషాన్ కిషన్ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. మరింత వేగంగా ఆడే ప్రయత్నంలో ఇషాన్ కిషన్ (77) పరుగులకు ఔటయ్యాడు.అతవి ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ మూడో వికెట్ కు 38 పరుగులు జోడించారు. తిలక్ వర్మ(25) ఔటయ్యాక.. శివమ్ దూబేతో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ కొనసాగించాడు.

వీరిద్దరూ ఐదో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. అయితే చివర్లో పాక్ బౌలర్లు పుంజుకోవడంతో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా డకౌటయ్యాడు. చివరికి భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో సయీమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఛేజింగ్‌లో పాకిస్థాన్ ఆరంభం నుంచే చేతులెత్తేసింది. తొలి ఓవర్లోనే హార్థిక్ పాండ్యా ఫర్హాన్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. విశేషమేమిటంటే తొలి నలుగురు బ్యాటర్లు కూడా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. ముఖ్యంగా బుమ్రా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడంతో పాక్ మళ్లీ కోలుకోలేకపోయింది.

సయీమ్ అయూబ్(6), సల్మాన్ అఘా(4), బాబర్ అజామ్(5) నిరాశపరిచారు. తర్వాత ఉస్మాన్ ఖాన్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. బాబర్ అజామ్ తో కలిసి 21, షాదాబ్ ఖాన్‌తో కలిసి 39 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే భారత బౌలర్లు పాక్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే ఉన్నారు. దీంతో సగం ఓవర్లకే పాక్ ఓటమి ఖాయమైపోయింది. టెయిలెండర్లు కాసేపు క్రీజులో నిలవడంతో భారత్ విజయం ఆలస్యమైంది. చివరికి పాకిస్థాన్  18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.

దీంతో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో హార్థిక్ పాండ్యా , బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ , తిలక్ వర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ టోర్నీలో మూడో విజయం అందుకున్న టీమిండియా సూపర్-8 బెర్త్ ఖాయం చేసుకుంది. తర్వాతి మ్యాచ్‌లో భారత్ బుధవారం నెదర్లాండ్స్ తో తలపడుతుంది. మరోవైపు భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ చివరి మ్యాచ్‌లో నమీబియాతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే పాక్ సూపర్ చేరుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం యూఎస్‌ఏ ముందంజ వేసే అవకాశాలున్నాయి.

స్కోరు బోర్డు 

భారత్ ఇన్నింగ్స్: 175/7 ( ఇషాన్ కిషన్ 77, సూర్యకుమార్ యాదవ్ 32, శివమ్ దూబే 27, తిలక్ వర్మ 25 ; సయీమ్ అయూబ్ 3/25)

పాకిస్థాన్ ఇన్నింగ్స్: 114 ఆలౌట్ ( ఉస్మాన్ ఖాన్ 44, షాహీన్ అఫ్రిది 23, షాదాబ్ ఖాన్ 14 ; పాండ్యా 2/16, బుమ్రా 2/17, వరుణ్ చక్రవర్తి 2/17, అక్షర్ పటేల్ 2/29)