బిస్మా బై బై..
కరాచీ, ఏప్రిల్ 25: పాకిస్థాన్ మహిళా క్రికెటర్ బిస్మా మరూఫ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 32 ఏళ్ల వయసులోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బిస్మా పాక్ తరపున 276 వన్డే మ్యాచ్‌లు ఆడి 6,262 పరుగులు సాధించింది. ఇందులో 33 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్‌లో తన లెగ్ స్పిన్‌తో 80 వికెట్లు ఖాతా లో వేసుకుంది. 96 మ్యాచ్‌ల్లో పాక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. 4 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లు ఆడిన బిస్మా 2009 నుంచి 2023 మధ్య ఎనిమిది టీ20 ప్రపంచకప్‌ల్లో జట్టు కు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇక బిడ్డను కనడం కోసం 12 నెలల పాటు మెటర్నిటీ లీవ్స్ తీసుకున్న తొలి క్రికెటర్‌గా బిస్మా మరూఫ్ నిలిచింది. న్యూజిలాండ్‌లో జరిగిన 2022 టీ20 ప్రపంచకప్‌కు పీసీబీ అనుమతితో పుట్టిన బిడ్డతో టోర్నీలో పాల్గొని బిస్మా వార్తల్లో నిలిచింది.






