8 May, 2026 | 11:07 PM

పాక్ దీనాలాపన

17-05-2024 12:05 AM

పాకిస్థాన్ ప్రజాప్రతినిధులు ఇటీవలి కాలంలో తమ దేశంలోని దుర్భర పరిస్థితుల గురించి మాట్లాడుతూ పనిలో పనిగా భారత్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పాక్ దయనీయ స్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్ పార్లమెంటులో చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘భారత్ చంద్రుడిపై కాలు మోపుతుంటే, పాక్ మాత్రం ఇంకా మురుకి కాల్వల్లో పిల్లల మరణాలను నియంత్రించలేక పోతోందంటూ అక్కడి పార్లమెంటు సాక్షిగా తమ దేశ దుర్భర పరిస్థితిపై వాపోయారు. ‘టీవీల్లో భారత్ చంద్రుడిపై కాలు మోపినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రెండు సెకన్లలోనే కరాచీలో పిల్లలు మురికికాలవల్లో పడి చనిపోయిన సమాచారమూ వచ్చింది. కరాచీ పాక్‌కు ప్రధాన ఆదాయ వనరు. రెండు నౌకాశ్రయాలున్నాయి. దేశానికి ఈ నగరం ముఖద్వారం వంటిది. కానీ, 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ తాగునీరు కూడా అందడం లేదు. వచ్చిన కొద్దిపాటి నీటినికూడా మాఫియా అక్రమంగా విక్రయిస్తోంది. దేశంలో 2.62 కోట్ల మంది పిల్లలు బడికి వెళ్లడం లేదు. ఇదీ మన దేశ దుస్థితి’ అంటూ మస్తఫా ఆవేదన చెందారు. ‘భారతదేశం ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ, దానికి కార ణం ఆ దేశ ప్రజలకు అందిస్తున్న విద్యే.

గత ముప్పయి ఏళ్లలో భారత్ ప్రపంచానికి ఏం అవసరమో దాన్నే బోధిస్తూ వచ్చింది. పాక్‌లో యూనివర్సిటీలు నిరుద్యోగులను తయారుచేసే  పరిశ్రమలుగా ఉంటున్నాయి. మనకు విదేశీ నిధులు ఉన్నాయి. కానీ, అవి  మనం తీసుకున్న అప్పులు చెల్లించడానికే చాలడం లేదు’ అని పాక్ ఆర్థిక పరిస్థితి, విద్యావిధానంపై సుదీర్ఘంగా జాతీయ అసెంబ్లీలో  మాట్లాడుతూ ముస్తఫా వాపోయారు. ముస్తఫా ఒక్కరే కాదు, ఇటీవలి కాలంలో భారతదేశం, ప్రధాని మోడీ గురించి ప్రశంసలు కురిసిస్తున్న పాక్ ప్రముఖులు చాలామందే ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన ప్రముఖ పాక్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ రెండు రోజుల క్రితం ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీని అభినందించారు. ‘మోడీ  జన్మతః నాయకుడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన పాక్‌లో పర్యటించారు. తన రాజకీయ పలుకుబడినే పణం గా పెట్టారు’ అని తరార్ అంటూ, మోడీ పాక్‌తో తిరిగి చర్చలు ప్రారంభిస్తారన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. పాక్‌లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక, రాజకీయ దుర్భర పరిస్థితులపై అక్కడి సామాన్య ప్రజలే కాదు, రాజకీయ నేతలు కూడా ఎంతగా విసిగిపోయారో వీరి మాటనుబట్టి అర్థమవుతోంది. ఒకప్పుడు తమ స్వార్థ ప్రయోజనాలు, భారత్‌తో ఉన్న శత్రుత్వం కారణంగా తాము పెంచి పోషించిన ఉగ్రవాద ముఠాలే ఇప్పుడు ఆ దేశానికి శాపంగా మారాయి.

ఈ ముఠాల కారణంగా అమెరికాసహా ఒకప్పుడు అన్ని విధాలుగా ఆ దేశాని కి అండగా ఉన్న దేశాలు ఇప్పుడు దూరమవుతున్నాయి. మరోవైపు రాజకీయ అస్థిరతకూడా ఆ దేశ కష్టాలకు కారణమవుతోంది. పాక్‌లో సుస్థిర మైన ప్రజాప్రభుత్వాన్ని చూసి ఎన్నో ఏళ్లయింది. సైన్యం చేతిలో కీలుబోమ్మలుగా మారిన లేదా అతుకుల బొంత లాంటి సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా పూర్తికాలం  కొనసాగలేక పోయాయి. బలమైన ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధానిగా ఒక్కరోజు కూడా పరిపాలన చేసేందుకు ప్రత్యర్థులు అవకాశం కల్పించలేదు. భారత్‌కు దగ్గర కావాలని ఆయన ప్రయత్నించినా సాగనివ్వలేదు. ఇమ్రాన్ సైతం ప్రధాని మోడీని, భారత్‌ను అప్పట్లో కొనియాడారు. ఈలోగా స్వయంకృతాపరాధాల కారణంగా పలు కేసుల్లో చిక్కుకున్న ఇమ్రాన్  చివరికి జైలు పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. చివరికి  మరోసారి సంకీర్ణ ప్రభుత్వమే దిక్కయింది. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని  కొత్త ప్రభుత్వం కూడా ఇప్పుడు భారత్‌కు దగ్గర కావాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌ను చెడ్డ చేసుకోవడం వల్ల తామేం కోల్పోయామో ఇప్పుడు పాక్ ప్రజలకు, నేతలకు తెలిసివస్తోన్నట్టు ఉంది. అందుకే, ఈ దీనాలాపనలు.