9 May, 2026 | 12:04 AM

ఎన్నికల సంస్కరణలు అత్యవసరం

17-05-2024 12:10 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల జాతర ముగిసింది. అనుకున్నట్లే ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని హింసాత్మక ఘట నల్లో చాలామంది గాయాల పాలయ్యారు. పోలీసులు లేకుంటే అనేకమంది ప్రాణాలు  కోల్పోయేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఇంకా పలు గ్రామాలు పోలీసుల నిఘా నీడలోనే ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక్క డ కులం, వర్గం, పార్టీలకంటే అభిమానం, స్థానిక నాయకత్వాలపై తిరుగుబాటు, ఒకరు అంటే మరొకరికి శత్రుత్వం అన్నీ కలిసి పనిచేశాయనిపిస్తుంది. ఎన్నికల సమయంలో జరిగే కొట్లాటలన్నీ వీటితోనే ముడిపడి ఉంటాయి. ఇక తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచాలని అధికారులు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. పాత నగరం హైదరాబాద్‌లో 39 శాతానికి మించి పెంచలేకపోయారు. సికింద్రా బాద్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో సైతం మిగతా చోట్లతో పోలిస్తే తక్కువే నమోదైంది. నాలుగో విడత జరిగిన ఎన్నికల్లో దేశం మొత్తం మీద 62 శాతానికి మించి ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోలేదు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు విడతల్లోను పోలింగ్ 65 శాతాని కి మించలేదు. ఓటర్ల నిరాసక్తతకు ప్రజాస్వామ్యంపై అపనమ్మకం, మండు టెండల్లో గంటల కొద్దీ క్యూల్లో నిలబడి ఓటు వేయడానికి ఓపిక లేకపోవడం, పట్టణ ప్రజలు ఓటింగ్ రోజును హాలీడేగా భావించడం లాంటి పలు కారణాలు కావచ్చని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. 

రానున్న రోజుల్లో ఉత్తరాదిన ఎండలు మరింత తీవ్రం కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మిగతా మూడు దశల్లో పోలింగ్ శాతం మరింత తగ్గే ప్రమాదం ఉంది. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే 65 శాతం మంది ప్రజలు ఓట్లు వేశారు. నాడు జరిగిన ఇందిరాగాంధీ హత్య దేశాన్ని మొత్తం కలవరానికి గురిచేయడంతో ప్రజలు మరొక పార్టీకి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. 400 సీట్లకు పైగా గెలిచారు. రాజీవ్‌గాంధీ ఐదేళ్లు సుస్థిరమైన పాలనను కూడా అందించారు. ఆయన కాలంలోనే ఓటుహక్కు వయసు 21 నుండి 18 ఏళ్లకు తగ్గించడం జరిగింది. భారత ఎన్నికల విధానంలో  ఇదొక గొప్ప సంస్కరణ. ఎన్నికైన ఒక ప్రజా ప్రతినిధి మరొక పార్టీలోకి వెళ్లకుండా  ఫిరాయింపు ల నిరోధక (యాంటీ డిఫెక్షన్) చట్టంకూడా రాజీవ్‌గాంధీ సమయంలో జరిగిం ది. అయితే, మన రాజకీయ నాయకుల పుణ్యమా అని ఇవి ఇప్పుడు పనికిరాని చట్టాలుగా మారిపోయాయి.

ఓటింగ్ ఎందుకు పెరగడం లేదు?

‘ప్రస్తుతం మనం ఓటింగ్ శాతాన్ని ఎందుకు పెంచలేకపోతున్నాం?’ అనేది ఆలోచించాలి. 1970- దశకం నుండి రాజకీయాలు కొత్త పుంతలు తొక్కడం మొదలుపెట్టాయి. పుట్టుకతో అందరూ ఒక్కటే. కాకపోతే, నిజాయితీ, నిస్వార్థం స్థానంలో స్వార్థం, డబ్బు, కక్షలు, కార్పణ్యాలు, హత్యలు, బంధువర్గాలు, కులం, మతం చోటు చేసుకుంటున్నాయి. రాజకీ య పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పుడే వారి ఆదాయ వ్యయాలు కోట్లలో ఉంటున్నాయి. ఒక సామాన్య ఉద్యోగి నెలసరి జీతాన్ని లెక్క వేసి ఖచ్చితంగా ఆదాయ పన్ను కట్టించుకుంటున్న ఆదా య పన్ను శాఖ పార్టీలు ప్రకటించే అభ్యర్థుల ఆస్తుల వివరాలను పట్టించుకోదా? పార్టీ తమ అభ్యర్థుల్ని ఏ ప్రాతిపదికన ప్రకటిస్తుంది? ప్రజల్లో  మంచిపేరు ఉందనా? లేక  వారివల్ల ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరుకుంటాయనా? నిజానికి ఇవేవీ కావు. పార్టీకి ఎవరు, ఎన్ని ఎక్కువ నిధులు సమకూరిస్తే వారికి టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంద న్నది అసలు వాస్తవం. సామాజిక వర్గాల సమీకరణాలు, బంధువర్గాలు, డబ్బు, బల నిరూపణతోపాటుగా ఎన్నో ఎత్తులు, జిత్తులు చేస్తేగాని పార్టీ టికెట్ రాదు. అందుకే, తన డబ్బు తాను తిరిగి సంపాదించుకోవడానికే ఆ అభ్యర్థి అయిదేళ్ళు కష్టపడతాడు. ఇలాంటి అభ్యర్థులకు నేనెందుకు ఓటు వేయాలి? అనుకుని మాత్రమే చాలామంది ఓటుకు దూరంగా వుంటున్నారనేది రాజకీయ పార్టీలు, అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎప్పుడూ చెడ్డవారు కారు. మంచీ చెడును నిశితంగా పరిశీలిస్తారు. మంచి చేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటారు. చెడు చేసిన వారిని తరిమి కొడతారు.

అభ్యర్థులకు తగిన అర్హతలుండాలి

ప్రస్తుత ఎన్నికల విధానంలో సంస్కరణలు తీసుకుని రావాల్సిన అవసరం చాలా వుంది. ఒక చిరు ఉద్యోగానికి అతని చదువు, వయసు, తెలివితేటలు, భాషా పరిజ్ఞానం వంటి విషయాలను పరిగణలోకి తీసుకునే ప్రస్తుత వ్యవస్థలో, అయి దేళ్లపాటు ఒక  ప్రజాప్రతినిధిగా వుండబోయేవారిని కూడా ప్రతి రాజకీయ పార్టీ అన్ని అంశాలను పరిశీలించి ప్రకటించాలి. రాబోయే రోజుల్లో పార్లమెంటు సీట్లు వెయ్యికి పెరిగే సూచనలు వున్నాయి. ప్రతి రాష్ట్ర అసెంబ్లీ నియోజక వర్గాల సంఖ్యలు కూడా పెరుగుతాయి. అప్పటిలోగా ఎన్నికల విధి విధానాలలో మార్పులను, సంస్క రణలను తేవాలి. ‘ప్రజాసేవ చేయగలడు’ అనేవారికి మాత్రమే టికెట్టు ఇవ్వడం నుండి, ఒకసారి ఎన్నికైన అభ్యర్థి అయిదేళ్ల వరకు మరొక పార్టీలోకి ఫిరాయించకుం డా ఉండటం, గెలిచిన పార్టీల ప్రభుత్వాలను పడగొట్టకుండా ఉండటం, శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు తమ నియోజక వరాల్లో  చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంపై ఎప్పటికపుడు సమీక్షించడం, ప్రభుత్వం విడుదల చేసే నియోజక వర్గాల నిధుల మొత్తాలు సద్వినియోగం అవుతున్నాయో లేదో కూడా సమీక్షించడం వంటివన్నీ తప్పనిసరి చేయాలి. ఎలక్షన్ కమిషన్ కేవలం ఎన్నికలను నిర్వహించడం మాత్రమే కాకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధులపైన కొన్ని నిర్దిష్టమైన బాధ్యతలు పెట్టినప్పుడు వారిపై ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. దానిని నిలబెట్టుకుంటే రెండవసారి కూడా ప్రజలు అతన్నే ఎన్నుకుంటారు. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రజలను సంక్షేమ పథకాల సునామీలో ముంచుతూ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పేద ప్రజలను ఉచిత వరాలతో ప్రసన్నం చేసుకోవాలనుకునే పార్టీలు సంపన్నులకు పలు పన్ను రాయితీల వెసులుబాటును కల్పిస్తున్నాయి. దీంతో సంపన్నులు, పేద వర్గాలకు మధ్య నలిగిపోతూ దిక్కు తోచని దుస్థితిలో ఉన్న మధ్యతరగతి ప్రజలు తమకు వచ్చేదేమీ లేదన్న నిరాశావాదంతో ఓటింగ్‌కు దూరంగా ఉండిపోతున్నారు. 

మరపురాని శేషన్  

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా 1990 నుండి 1996 వరకు పనిచేసిన టి.ఎన్. శేషన్ అందించిన సేవలు చాలామంది మరిచిపోరు. ఢిల్లీనుండి గల్లీదాక ఎన్నికల పరిశీలకులను పెట్టి ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ నాయకులకు విధి విధానాలు తెలియజేసి వారికి ముచ్చెమటలు పట్టించారు. ఓటు వేయడంలో ప్రజలు పాటించే నియమావళికి కూడా అయన నాడు నాంది పలికారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ నియమావళిలో వున్నవే. కానీ, అప్పటివరకు కమిషన్ అధికారులు వాటిని పట్టించుకోలేదు.  ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన తరువాతనే  భారతదేశానికి ఇవి మాత్రమే సరిపోతాయనే ఆలోచనతో మరొక వందేళ్ల భవిష్యత్తును ఊహించి రాజ్యాంగం రచించారు. భారతదేశ ఎన్నికలకు విధి విధానాలను కూడా ఆనాడే రాజ్యాంగ నిపుణులు రచించారు. ఇవన్నీ శేషన్ లాంటి వారివల్లనే వెలుగులోకి వచ్చాయి. 

కన్నోజు మనోహరాచారి

 వ్యాసకర్త సెల్: 7995089083