29 May, 2026 | 2:54 AM

తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ కరపత్రం విడుదల

29-05-2026 12:26 AM

ఘట్ కేసర్, మే 29 (విజయక్రాంతి): తాపీ మేస్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అవహేళన చేస్తూ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు చెసిన వ్యాఖ్యలు దురదృష్ట కరమని ఘట్కేసర్ బిఎన్‌ఆర్కేఎస్ సంఘం సభ్యులు ఖండించారు. ఘట్కేసర్ డివిజన్ ప్రైమ్ ల్యాండ్ అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో గురువారం బిఎన్‌ఆర్కేఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామల్ల అయిలయ్య ఆదేశాల మేరకు  సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైదరాబాదులో జూన్ 8న తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ కరపత్రాన్ని స్థానిక సంఘం సభ్యులు  విడుదల చేశారు.

ఈ మేరకు స్థానిక సంఘం అధ్యక్షుడు సిహెచ్. నాగేశ్వరరావు, వై. చెన్నయ్య, టి. శ్రీను, ఎం. మాల్యాద్రి, ఎం. శ్రీనివాస్, ఓ మాల్యాద్రి, ఓ. రాంబాబు, టి. శ్రీను, టి.సత్యనారాయణ, ఎం. శ్రీనివాసులు, అంకం రావు మాట్లాడుతూ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ రేట్లు పెంచడం కోసమో, హక్కుల కోసమో అయితే తాపీ మేస్త్రీల మద్దతు ఉండేది, కానీ తాపీ మేస్త్రీ హటావో సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ బచావో, తాపీ మేస్త్రీలు మధ్యవర్తులు, దళారుల అనే నినాదాలతో సమ్మె కొనసాగించడం  ఏమిటని వారు ప్రశ్నించారు.

కార్మికులు సంఘటితమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయంలో తోటి తాపీ కార్మికులపై నిందలు మోపుతూ సమ్మె చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.  తాపీ మేస్త్రీలు భవన నిర్మాణ రంగంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడని పేర్కొన్నారు. ఐక్యతతో కలసి పోరాటం చేసినప్పుడే సమస్యల పరిష్కారం సాధ్యమైతుందని గుర్తు చేశారు. జూన్ నెల 8న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభలో మేస్త్రీలు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.