15 July, 2026 | 3:36 AM

పంత్ ప్రతాపం

25-04-2024 12:41 AM

దంచికొట్టిన రిషబ్

n గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు

పరుగుల వరద పారిన పోరులో ఢిల్లీని విజయం వరించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య ఆఖరి బంతికి ఫలితం తేలిన పోరులో గుజరాత్ పరాజయం వైపు నిలిచింది. మొదట రిషబ్ పంత్ మెరుపులకు, అక్షర్ పటేల్ సహకారం తోడవడంతో ఢిల్లీ భారీ స్కోరు చేయగా.. ఛేదనలో సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ దంచికొట్టారు. గుజరాత్ విజయం ఖాయమే అన్న దశలో మిల్లర్ వెనుదిరగగా.. చివర్లో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించినా లాభం లేకపోయింది. 

ఢిల్లీ: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో ఢిల్లీది పైచేయి అయింది. బుధవారం సొంతగడ్డపై జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (43 బంతుల్లో 88 నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. సందీప్ వారియర్ ధాటికి 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును పంత్, అక్షర్ ఆదుకున్నారు.

గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి ధాటిగా పరుగులు రాబట్టారు. ఈ జంట నాలుగో వికెట్‌కు 68 బంతుల్లో 113 పరుగులు సాధించగా.. చివర్లో క్యాపిటల్స్ ఇన్నింగ్స్ రాకెట్‌ను తలపించింది. మోహిత్ వేసిన 18వ ఓవర్‌లో 14 పరుగులు రాగా.. సాయి కిషోర్ వేసిన తదుపరి ఓవర్‌లో స్టబ్స్ (7 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) 4,6,4,6 దంచగా.. ఆఖరి ఓవర్‌లో పంత్ 4 సిక్సర్లు, ఒక ఫోర్ సహా 31 పరుగులు పిండుకోవడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. చివరి 5 ఓవర్లలో క్యాపిటల్స్ 97 పరుగులు రాబట్టుకోవడం విశేషం. గుజరాత్ బౌలర్లలో సందీప్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), మిల్లర్ (23 బంతుల్లో 55; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. కెప్టెన్ గిల్ (6), అజ్మతుల్లా (1), షారుక్ ఖాన్ (8), రాహుల్ తెవాటియా (4) విఫలం కాగా.. ఆఖర్లో రషీద్ ఖాన్ (21 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), సాయి కిషోర్ (13; 2 సిక్సర్లు) క్యాపిటల్స్‌ను భయపెట్టారు. చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి ౧౯ పరుగులు అవసరం కాగా రషీద్‌ఖాన్ తొలి రెండు బంతులకు ఫోర్లు బాదాడు. ఐదో బంతికి సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ బౌలర్లలో రసిక్ సలాం 3, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు.  లీగ్‌లో భాగంగా గురువారం ఉప్పల్‌లో బెంగళూరుతో హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది.