18 June, 2026 | 1:33 AM

కాసుల కోసం కన్నప్రేమ విక్రయం!

18-06-2026 12:00 AM
  1. సంగారెడ్డి జిల్లాలో పసికందుల వేలం.. 
  2. నెట్వర్క్ వెనుక ఉన్నదెవరు?
  3. లక్షల్లో వ్యాపారం.. వస్తువుల్లా మారుతున్న పసికందులు
  4. దవాఖానాల అండతోనే పిల్లల స్మగ్లింగ్ ముఠాల జోరు
  5. కడుపు కోతకు ‘ధర’..  తండాలు, ఆసుపత్రులే టార్గెట్

సంగారెడ్డి, జూన్ 17(విజయక్రాంతి)/ ప టాన్చెరు : సంగారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా సరిహద్దు పరిసర ప్రాంతాలలో ఇటీవలి కా లంలో ప్రైవేట్ ఆసుపత్రుల సిబ్బంది, ఆర్‌ఎంపీలు, మధ్యవర్తులు ఒక ముఠాగా ఏర్పడి పసికందుల అక్రమ విక్రయాల దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇందుకు తాజాగా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారంలో శిశు విక్రయాన్ని పోలీసులు అడ్డుకున్న విషయం వెలుగులోకి వచ్చింది.

నిరుపేద కుటుంబాలు, గిరిజన తండాల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఈ దందా సాగుతోంది. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లలోని కొందరు సహాయక సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు ఇన్ఫార్మర్లుగా మారుతున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారినీ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గర్భిణీలనూ గుర్తించి మధ్యవర్తులకు సమాచారం ఇస్తున్నారు. 

లక్షల్లో బేరాలు.. తల్లిదండ్రులకు చిల్లర.. 

నిస్సహాయులైన కన్నవారి నుండి కేవలం రూ.30,000 నుండి రూ.50,000 ఇచ్చి పసిపాపలను తీసుకుంటున్న ముఠాలు, సంతానం లేని ధనిక దంపతులకు రూ.3 లక్షల నుండి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నాయి. మధ్యలో ఉన్న సబ్-ఏజెంట్లు, బ్రోకర్లే సింహభాగం నొక్కేస్తున్నారు. కేవలం జిల్లా పరిధిలోనే కాకుండా హైదరాబాద్ శివార్ల ద్వారా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల ముఠాలతో కూడా వీరికి సంబంధాలు ఉంటున్నాయని విశ్వసనీయ సమాచారం. నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించి అక్రమ దత్తతలను లీగల్గా చూపిస్తున్నారు. 

ఐసీడీఎస్, అంగన్వాడీల నిఘా లోపం..

గ్రామాల్లో, తండాలలో గర్భిణీల వివరాలు నమోదు చేస్తున్నా, ప్రసవం తర్వాత పిల్లలు కనిపించకుండా పోతున్నా ఐసీడీఎస్, చైల్ వెల్ఫేర్ యంత్రాంగం సకాలంలో గుర్తించలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన ఓ కుటుంబం భారమౌతుందని ఆడపిల్లని రూ.3 లక్షలకు విక్రయించగా, ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల న్యాల్కల్ పరిధిలో ఒక పసికందును రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిన ఘటన కూడా పిల్లల రక్షణపై ఉన్న నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది.  

పోలీస్ నిఘా ఎక్కడ?

జిల్లాలోని ఐవీఎఫ్ సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ మెటర్నిటీ హాస్పిటల్స్పై స్పెషల్ ఆపరేషన్ టీమ్స్  నిఘా పెట్టాల్సి ఉండగా  ఆచరణలో అమలు కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా నేరుగా డబ్బులు ఇచ్చి పిల్లలను కొనేవారిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

పసికందు విక్రయాల ముఠా గుట్టు రట్టు..

సంగారెడ్డి జిల్లా రుద్రారంలో పసికందు విక్రయాల ముఠా గుట్టు రట్టు కావడం కలకలం సృష్టించింది. 17 ఏళ్ల మైనర్ బాలికకు పుట్టిన ఆడపిల్లను రూ. 5 లక్షలకు విక్రయించేందుకు కుటుంబ సభ్యులు, ముఠా సభ్యులు ఒప్పందం చేసుకున్నారు. అయితే బాలిక ప్రతిఘటించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రుద్రారంలో ఆస్సాంకు చెందిన మైనర్ దంపతులు నివసిస్తున్నారు. కాన్పు కోసం ఆమె ఆస్పత్రిలో చేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

గర్భవతిగా ఉన్నప్పుడే శిశువును రూ.5 లక్షలకు విక్రయించేలా బాలిక భర్త, అత్త, మానవ అక్రమ రవాణా ముఠాతో ఒప్పందం చేసుకున్నారు. ప్రసవం అనంతరం బిడ్డను ముఠాకు అప్పగించేందుకు భర్త, అత్త తీవ్రంగా వేధించారు. బాలిక ధైర్యంగా స్పందించి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును కాపాడి తల్లికి అప్పగించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠా సభ్యులపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.