వేసవి కాలం.. చిన్నారులు పైలం..
సెలవుల్లో చిన్న నిర్లక్ష్యంతో ప్రాణాలకు ముప్పు
తల్లిదండ్రులు బాధ్యతగా నడుచుకోవాలనీ సూచన
అప్రమత్తతోనే ప్రమాదాలు నివారించవచ్చంటున్న నిపుణులు
చిట్యాల, ఏప్రిల్ 20: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఒకవైపు, పాఠశాలలో చదివే చిన్నారులకు మరో మూడు రోజుల్లో రాబోతున్న వేసవి సెలవులు మరోవైపు. వేసవి సెలవులు ప్రారంభమైన వెంటనే పిల్లలు ఆటపాటలతో బయట గడిపే సమయం, బంధువుల ఇంటికి వెళ్లడం, బయట ఇరుగుపొరుగు స్నేహితులతో ఆడుకోవడం లాంటివి పెరగడం సహజమే. ఈ క్రమంలో వారి పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన వివిధ కారణాలతో వారి ప్రాణాలకు పెను ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. అందుకే వేసవి సెలవుల్లో చిన్నారుల పట్ల తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కాటేసిన కారులాక్ :
ఇటీవల నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి గ్రామానికి చెందిన ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఐదు సంవత్సరాల చిన్నారి ఆడుకోవడానికి బయటికి వెళ్లి, గృహ నివాస సమీపంలో నిలిపి ఉన్న కారులోకి ఎక్కింది. వెంటనే డోర్ లాక్ అయిపోవడంతో బయటకు రాలేక, కారు తలుపులు ఎలా ఓపెన్ చేయాలో తెలియక ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం అందరిని కలచివేసింది. ఈ ఘటన ఒక్కటే కాదు& ఇటీవలి కాలంలో చిన్నారుల మరణాలు వివిధ కారణాలతో పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
వాహనాల్లో చిక్కుకోవడం:
పార్క్ చేసిన కార్లు కొద్దిసేపట్లోనే ఓవెన్లా వేడెక్కిపోతాయి. లోపల చిక్కుకున్న పిల్లలకు శ్వాస తీసుకోవడం కష్టమై ప్రాణాపాయం కలుగుతుంది. కావున చుట్టుపక్కన వాహనాలను ముందుగానే డోర్లు ఓపెన్ అవ్వకుండా లాక్ చేసుకోవాలి.
నీటి ప్రమాదాలు :
బావులు, చెరువులు, ట్యాంకులు దగ్గర ఆడుకుంటూ పిల్లలు ప్రమాదవశాత్తూ పడిపోవడం జరుగుతోంది. ఇరుగుపొరుగు పిల్లలతో ఈత నేర్చుకోవడానికి వెళ్లి ప్రమాదాల బారిన పడటం నిత్యం జరుగుతూనే ఉన్నాయి.
ఎలక్ట్రిక్ షాక్లు:
తెరిచి ఉన్న వైర్లు, లోపభూయిష్టమైన పరికరాలు, టీవీలు, కూలర్లు వేసే క్రమంలోనూ, మొబైల్ ఛార్జింగ్ లు పెట్టే సమయంలోను, చార్జింగ్ పెట్టి మొబైల్ లో గేమ్స్ ఆడటం, వీడియోలు చూడటం, చిన్నారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి.
రోడ్డు ప్రమాదాలు:
ఆడుకుంటూ రోడ్డుపైకి పరుగెత్తడం, సైక్లింగ్ చేస్తూ, క్రికెట్ వంటి ఆటలు ఆడుతూ పిల్లలు చూసుకోకుండా రోడ్లపైకి రావడం వలన వాహనాలు ఢీకొట్టే ప్రమాదం ఉంది. వేడి ప్రభావం ఎండలో ఎక్కువసేపు ఉండ డం వల్ల, సరైన నీటిని తీసుకోకపోవడం వల న బాడీ డిహైడ్రేట్ అయి చిన్నారులు అనారోగ్యానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎండలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వీధి కుక్కల దాడులు
పట్టణాలలో, గ్రామాలలో పెరుగుతున్న వీధి కుక్కలు పెద్దలపై, చిన్నారులపై దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. పసి పిల్లలు, చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే అవి దాడి చేస్తున్నాయి. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి సరైన ఆహారం, నీరు అందక వీధి కుక్కలు రెచ్చిపోయి చిన్నారులపై దాడులు చేసే అవకాశం ఉన్నందున వాటి నుండి తల్లిదండ్రులు పిల్లలను కాపాడుకోవాలి.
తల్లిదండ్రులదే బాధ్యత :
చిన్నారులను ఒంటరిగా బయటికి పంపించకుండా తల్లిదండ్రులే బాధ్యతాయుతంగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో ఉన్న కార్లు, వాహనాలు తప్పనిసరిగా లాక్ చేయాలి. పిల్లలకు ప్రమాదాల గురించి సరళంగా, భయపెట్టకుండా అవగాహన కల్పించాలి. నీటి వనరుల దగ్గర భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఎలక్ట్రిక్ వైర్లు, పరికరాలు సురక్షితంగా ఉంచాలి. పిల్లలు ఎక్కడ ఆడుతున్నారో తరచుగా గమనించాలి. ఎండలో ఆడకుండా చూసుకుంటూ, తరచూ సరైన నీటిని అందించాలి. ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించి అవగాహన కల్పించాలి.
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
వేసవి సెలవుల్లో చిన్నారులు తమ ఇష్టానుసారంగా ఆటలు ఆడడం, సైకిళ్లు తొక్కుతూ రోడ్లపైకి వెళ్లడం, ఆగిన వాహనాల్లోకి ఎక్కి కూర్చోవడం వంటి పనులు చేస్తుంటారు. ఇవే ఒక్కొక్కసారి వారి ప్రాణా ల మీదికి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున చిన్నారుల పట్ల వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. అప్పుడే ప్రమా దాలు జరగవు.
- మామిడి రవి, ఎస్‌ఐ, చిట్యాల






