14 August, 2026 | 3:10 PM

అమరుల యాదిలో గీతన్నాల చైతన్య యాత్ర

14-08-2026 02:02 PM

బోధన్, ఆగస్టు 14 (విజయక్రాంతి): గీత కార్మికుల సమస్యల పరిష్కారం, కల్లుగీత వృత్తి పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన అమరుల యాదిలో గీతన్నాల చైతన్య యాత్ర శుక్రవారం బోధన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ యాత్ర గీత కార్మికుల సమస్యలపై పోరాటానికి చైతన్యం కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వం కల్లుగీత వృత్తిని నిర్వీర్యం చేస్తూ మరోవైపు మద్యపానాన్ని ప్రోత్సహిస్తోందని వారు విమర్శించారు. దీంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయి వృత్తికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతివృత్తులను రక్షించాల్సిన ప్రభుత్వం లాభాల కోసం వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.

కల్లుగీత వృత్తి పరిరక్షణ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకుంటూ ఈ చైతన్య యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికుల సంక్షేమం, వృత్తి రక్షణకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. వృత్తిలో మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. టీఎఫ్‌టీ సొసైటీలకు, లైసెన్సులకు కొత్తగా అనుమతులు ఇచ్చి వృత్తిని ప్రోత్సహించాలని, గీత కార్మికులకు ప్రత్యేక రుణాలు అందించాలని కోరారు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి 10 ఎకరాలు, టీఎఫ్‌టీకి 5 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. కల్లుగీత వృత్తి పరిరక్షణకు సమగ్ర చట్టం తీసుకురావాలని, కల్లును మత్తు పానీయాల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకట్ నరసయ్య, ఉప్పలయ్య, వెంకన్న, రమేష్ గౌడ్, బుర్ర సుధాకర్, పాలకూరి జగన్ గౌడ్, రాజేష్, బక్క నాగేశ్వరరావు, సోషల్ మీడియా బాధ్యులు రాజేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు జె. శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జంగం గంగాధర్, ఎన్‌పీఆర్‌డీ జిల్లా కార్యదర్శి ఏషాల గంగాధర్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెద్ద వెంకట రాములు, జిల్లా అధ్యక్షులు కొయ్యాలి నరసింహులు, జిల్లా నాయకులు శ్రీరామ్ గౌడ్, టీసీఎస్ అధ్యక్షులు పిల్లకుంట్ల గంగాధర్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, రవీందర్ గౌడ్, సాయ గౌడ్, శోభన శ్రీనివాస్ గౌడ్, బక్క రామ గౌడ్, సిద్ధిరాములు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ సాయిబాబా గౌడ్, సదాశివ గౌడ్, భూమా గౌడ్, సత్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.