29న కొండగట్టుకు పవన్ కల్యాణ్
వారాహి దీక్షలో ఏపీ డిప్యూటీ సీఎం
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవన్ కల్యాణ్ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం కోసం ఆయన జగిత్యాల జిల్లాకు విచ్చేయనున్నారు. ఎన్నికల ముందు కూడా ఆయన కొండగట్టును దర్శించుకున్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారి అంజన్నను దర్శించుకోనున్నారు. కాగా, కొండగట్టు అంజన్న పవన్‌కల్యాణ్ సెంటిమెంట్‌గా భావిస్తూ వస్తున్నారు.
ఇందులో భాగంగానే 29న కొండగ ట్టులో మొక్కులు సమర్పించుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పవన్ మంగళవారం వారాహి మాత దీక్షను చేపట్టారు. ఎన్నికల సమయంలో ఆయన ప్రచార రథం పేరు కూడా అదే కావడంతో పవన్ చేపట్టిన దీక్షపై హాట్‌టాపిక్ నడుస్తోంది. ఈ దీక్షను ఆయన 11 రోజులు పాటించనున్నారు. ఏపీలో 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో అనూహ్య విజయం సొంతం చేసుకున్న జనసేన అధినేత పవన్.. తనపై ఎలాంటి దిష్టి, దృష్టి ప్రభా వం పడకుండా ఈదీక్షను చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.






