ఫీజు బకాయిలు చెల్లించండి
సీఎస్ రామకృష్ణారావుకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ వినతి
హైదరాబాద్, ఫిబ్రవరిర 26 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ గురువారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావుతో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... గత ఐదు సంవత్సరాలుగా రావలసిన ఏడువేల కోట్ల ఫీజుల బకాయిలను విడుదల చేయాలని కోరారు.
ఫీజుల రీయింబర్స్‌మెంట్ సమస్య ప్రైవేటు కళాశాల యజమాన్యాలు, ప్రభుత్వ మధ్యాన ఉన్న సమస్య కాదని, 22 లక్షల పేద విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యగా ప్రభుత్వం చూడాలని విన్నవించారు. ఫీజుల నిధుల విడుదల విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం చేస్తున్నదని అభిప్రాయపడ్డారు. బకాయిలు విడుదల కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
5 వేల కోట్లతో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసే బదులు, పేద విద్యార్థుల ఫీజుల కోసం ఆ నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై త్వరలోనే గవర్నర్‌ను, సీఎంను కలుస్తామని చెప్పారు. మార్చ్ 16 అసెంబ్లీ సమావేశాల లోపు బకాయిలు విడుదల చేయకపోతే వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.




