27 February, 2026 | 10:52 AM

సుస్థిర ప్రగతి లక్ష్యం కావాలి: కేయూ వైస్ ఛాన్సలర్

27-02-2026 12:00 AM

కాకతీయ యూనివర్సిటీ, ఫిబ్రవరి 26,(విజయక్రాంతి): మానవ సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సుస్థిర ప్రగతే లక్ష్యాలు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం కేయూ సెనేట్ హాల్లో సోషల్ సైన్సెస్, ఆరట్స్ విభాగాల డీన్ ఆచార్య బి. సురేష్ లాల్ అధ్యక్షతన నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు ఇంటిగ్రేటింగ్ ఎస్డీజీస్ ఫర్ వికసిత్ భారత్ 2047 అచీవ్మెంట్స్ అండ్ పాత్వేస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులను ఉద్దేశించి మాట్లాడుతూ పెదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, సమగ్ర వైద్య సేవలు, వివక్ష నిర్మూలన వంటి అంశాలపై దృష్టి పెట్టడం ద్వారానే ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, సూచనలు అమలు చేస్తున్నాయని తెలిపారు.

2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవాలని, తెలంగాణ రాష్ట్రం ‘రైజింగ్ తెలంగాణ’ దిశగా 2030 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నదని వివరించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, సోషియాలజీ విభాగాధిపతి ఆచార్య ఎం. స్వర్ణలత, తెలుగు విభాగాధిపతి డాక్టర్ ఎం. లింగయ్య, విద్య, వైద్యం ,పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకటయ్య, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ చిలువేరు రాజ్కుమార్, జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు, విశ్రాంత ఆచార్యులు ఎం. విద్యాసాగర్ రెడ్డి, పాలక మండలి సభ్యులు డాక్టర్ బి. రమ, డాక్టర్ చిర్రా రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ విభాగాధిపతి డా. ఆర్. మేఘనా రావు, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ బి. రాధికా రాణి ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సంచికలను ఆవిష్కరించారు.