12-10-2025 01:22:07 PM
హైదరాబాద్: దూరదృష్టితో యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కుల చట్టం తీసుకొచ్చిందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పాలనలో పారదర్శకతను తీసుకురావడమే సమాచార హక్కు చట్టం ముఖ్య లక్ష్యమన్నారు. పాలనలో ఎవరైనా తప్పు చేస్తే సామాన్యుడు ప్రశ్నించేలా ఆర్జీఐ చట్టం తీసుకొచ్చామని, గొప్ప చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు సంపూర్ణమైన హక్కులను యూపీఏ ప్రభుత్వం కల్పించిందని మహేష్ గౌడ్ వెల్లడించారు.
కాంగ్రెస్ తీసుకొచ్చే గొప్ప చట్టాలను ఏన్డీయే ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి దాని స్వతంత్రను బలహీన పరిచారని, ఆర్టీఐ కమీషనర్ పదవీకాలం, జీతభత్యాలను కేంద్రమే నిర్ణయించేలా సవరణలు చేశారని ఆయన వివరించారు. వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారని మండిపడ్డారు. కేంద్రంలో 11 మంది ఆర్టీఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని, ఆర్జీఐని నీరుగార్చేందుకు కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని పీసీసీ చీఫ్ మండిపడ్డారు.