calender_icon.png 12 October, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి కుట్రవల్లే 42% రిజర్వేషన్లకు అడ్డంకి.!

12-10-2025 01:28:29 PM

- న్యాయపరంగా కాంగ్రెస్ పక్కాగా ముందుకు వెళుతుంది.

- బిజెపి సహకారం వల్లే హైకోర్టుకు రిజర్వేషన్ పంచాయతీ.

- ఎట్టి పరిస్థితుల్లోను 42 రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం.

- పారదర్శకంగా డిసిసి నియామక ప్రక్రియ.

- పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి.

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): దేశంలో జనాభా దామాషా ప్రకారం వెనుకబడ్డ కులాలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతోనే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కృత నిశ్చయంతో ఉన్నారని అందులో భాగంగానే కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ముందుకు వెళ్లినట్లు పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ బిసి జనాభా దామాషా ప్రకారం 42% రిజర్వేషన్ అమలు జరిగేలా న్యాయపరమైన చిక్కులు లేకుండానే ప్రభుత్వం జీవో ఇచ్చినట్లు తెలిపారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి స్వగృహంలో పీసీసీ ఉపాధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డితో పాటు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో 52%, తమిళనాడులో 69% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టా బద్ధత సాధించగా తెలంగాణ రాష్ట్రంలోనూ జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు లేకుండా జీవో నెంబర్ 9 విడుదల చేసినట్లు తెలిపారు. కాగా బిజెపి అండదండలతో కొందరు బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించినట్లు తెలిపారు.

అయినప్పటికీ ఎట్టి పరిస్థితులను బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ముందుకు వెళ్తామని అందుకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్విరామంగా శ్రమిస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ వారిగా అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా అధ్యక్ష ఎన్నికలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా గ్రామీణ స్థాయి నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతోందని నాగర్ కర్నూల్ వనపర్తి గద్వాల జిల్లా పరిధిలోని అభ్యర్థుల ఎంపిక, అభిప్రాయ సేకరణ బాధ్యత తనదేనన్నారు. ఈనెల 22 వరకు పూర్తి నివేదికను ఏఐసీసీకి పంపగా వారి నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక తుది జాబితా వెలువడుతుందన్నారు.