3 August, 2026 | 8:32 PM

ప్రశాంతంగా ఐదో విడత పోలింగ్

21-05-2024 01:28 AM

60.43 శాతం నమోదు

49 నియోజకవర్గాల్లో ఎన్నికలు

అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 75.75 శాతం

అత్యల్పంగా మహారాష్ట్రలో 54.33 శాతమే

న్యూఢిల్లీ, మే 20: సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరిగింది. ఈ విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారందరి భవితవ్యం ఈవీఎంలలో ఓటర్లు నిక్షిప్తం చేశారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 60.43 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 75.75 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా మహారాష్ట్రలో 54.33 శాతం రికార్డయింది. బీహార్‌లో 54. 85 శాతం, జమ్మూ కశ్మీర్‌లో 57.82 శాతం, ఝార్ఖండ్‌లో 63.09 శాతం, ఒడిశాలో 69.34 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 57.79 శాతం, లఢక్‌లో 69.62 శాతం పోలింగ్ నమోదైంది.

అలాగే ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా సోమవారమే పోలింగ్ జరిగింది. ఐదో విడతలోనే తక్కువ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఝార్ఖండ్‌లో మూ డు, ఒడిశాలో 5, ఉత్తరప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7, లఢక్‌లో ఒకటి, జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానానికి సోమవారం ఓటింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్నో నుంచి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముంబై నార్త్ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాయ్‌బరేలీ నుంచి  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ విడతలో బరిలో ఉన్నారు.