బాలికపై అత్యాచారం, హత్య
ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష విధించిన కోర్టు
న్యూఢిల్లీ, మే 20: రాజస్థాన్‌లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడడంతో పాటు హత్య చేసిన ఇద్దరు నిందితులకు పోక్సో కోర్టు శనివారం ఉరిశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో కలు, కన్హా కలేబ్లియా అనే ఇద్దరు సోదరులు 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. బతికుండగానే బొగ్గుల కొలిమిలో పడేసి కాల్చేశారు. కేసును విచారించిన బిల్వారాలోని పోక్సో కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది.
ఇద్దరికీ మరణ శిక్ష విధిస్తున్నట్లు తేల్చి చెప్పింది. ఈ తీర్పునిచ్చే క్రమంలో జడ్జి అనిల్ గుప్తా మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలను అరుదైనవిగా పరిగణించాలని వెల్లడించారు. అయితే, ఈ కేసులో సాక్ష్యాధారాలు ధ్వంసం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీళ్లని నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ రాజస్థాన్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యే అవకాశముంది.
సంచలనం సృష్టించిన ఘటన..
గతేడాది ఆగస్టు 3వ తేదీన బిల్వారా జిల్లా కొత్రి తహసీల్ పరిధిలోని షాపురా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పశువులను మేపుకుంటూ ఉండగా బాలికపై ఇద్దరు దారుణంగా అత్యాచారం చేశారు. తల్లిదండ్రులు రాత్రి 10 గంటల ప్రాంతంలో బొగ్గుల కొలిమి నుంచి పొగ రావడం గమనించి అక్కడికి వెళ్లారు. అక్కడ బాలిక దుస్తులు, చెప్పులు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫోరెన్సిక్ నిపుణులు హస్తికలను వెలికితీసి విచారణ ప్రారంభించారు.
బతికుండగానే బాలికను కొలిమిలో వేసి కాల్చినట్లు వెల్లడించారు. అత్యాచారం తర్వాత ఆమె తలపై కర్రతో మోది చంపారని విచారణలో తేలింది. ఈ ఘటన రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పోలీసులు 30 రోజుల్లో 400 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు నిందితులిద్దరికీ మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.






