26 February, 2026 | 7:17 AM

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షల ప్రారంభం

26-02-2026 12:00 AM

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్లు, ఎస్పీలు

ఆదిలాబాద్/మంచిర్యాల/కుమ్రంభీం ఆసిఫాబాద్/నిర్మల్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాల ని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు పరీక్షకు మొత్తం 9,396 మంది విద్యార్థులకు గాను, 8,839 మంది హాజరయ్యారని, 557 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు.

పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలన్నారు. తాగునీరు, వెలుతురు, విద్యార్థులు కూర్చోవడానికి సరైన బెంచీలు ఉన్నాయా లేదా అని స్వయంగా పరిశీలించారు. అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షా గదుల్లో సిసి కెమెరాల పనితీరును పరిశీలించిన ఆయన, నిరంతరం రికార్డింగ్ జరిగేలా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు కొనసాగించాలని ఎస్పీకి సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమలో ఐటిడిఏ పీఓ యువరాజ్ మర్మాట్, శిక్షణ ఐపీఎస్ రాహుల్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గణేష్ జాదవ్, చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమ య్యా యి. మొదటి రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష జరుగగా 96.50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 6688 (5776 జనరల్, 912 వొకేషనల్) మంది విద్యార్థులకు 229 (173 జనరల్, 56 వొకేషనల్) మంది పరీక్షకు గైర్హాజరు కాగా 6459 (5603 జనరల్, 856 వొకేషనల్) మంది విద్యార్థులు పరీక్ష రాశారు. కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల, వేంపల్లి ప్రాం తంలోని ఎస్. ఆర్. ఆర్. కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా ఇంట ర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, హాజీపూర్ మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా  బుధవారం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల (బాలికలు, బాలురు) జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

నిర్మల్ జిల్లాలో బుధవారం ఇంటర్మీడియ ట్ బోర్డు పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని 23 పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు 7076 విద్యార్థులకుగాను 67 72 విద్యార్థులు పరుషకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పట్టణంలోని శాంతినగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటర్ పరీక్షలను తనిఖీ చేశారు. దిల్వార్పూర్ నిర్మల్ మాముడా లక్ష్మ ణ చందా తదితర మండలాలు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పురుషోత్తం నాయక్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు సలహాలు అందించారు.